
వెన్నుపోటు రాజకీయాలు ఎక్కువయ్యాయి!
వరదయ్యపాళెం: ‘దళిత నియోజకవర్గమైన సత్యవేడులో ఇటీవల వెన్నుపోటు రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయి. సంపన్న వర్గాలు పెత్తనం చెలాయించేందుకు ఆత్రుత పడుతున్నారు. వారి కుతంత్రాలకు, కుట్రలకు నేను వెరవను. అన్నీ భగవంతుడు చూసుకుంటాడు.’అని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆవేదన చెందారు. వరదయ్యపాళెం ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం జరిగిన అధికారుల సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. 15 ఏళ్లుగా నియోజకవర్గంలో ప్రజాసేవకే పరిమితమయ్యానే తప్ప, ఇతర వ్యాపకాలు, వ్యాపారాలకు ఏనాడు కక్కుర్తి పడలేదన్నారు. అయితే తాను నియోజకవర్గంలో రెండో సారి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ కొన్ని అనివార్య కారణాలతో తనను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసిందని, ఈ తరుణంలో నియోజకవర్గంలో ఎన్నికల పరిశీలకులని ఒకరు, నియోజకవర్గ కో–ఆర్డినేటర్ అని మరొకరు, తాజాగా ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ అని ఇంకొకరు ఇలా సంపన్న వర్గాల వారు నియోజకవర్గంలో పెత్తనం చెలాయించేందుకు తహతహలాడుతున్నారని విమర్శించారు. ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్‌గా నియమితులైన శంకర్‌రెడ్డి పదవి చేపట్టిన పది రోజులకే ఉన్న విభేదాలను ఇంకాస్త రెట్టింపు చేసి, ఇబ్బంది పెడుతున్నారే తప్ప సమన్వయం చేసి ఏకతాటిపై పార్టీని నడిపేందుకు ఏమాత్రం చొరవ చూపడం లేదన్నారు. తనకు, ఆయనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తామిద్దరం మంచి స్నేహితులే అయినప్పటికీ ఆయన వెంట ఉన్నవారు చెడు మార్గంలో నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ అనుభవం లేని శంకర్‌రెడ్డి ఆలోచనతో ముందుకు పోవాలని సూచించారు. 15ఏళ్లుగా నియోజకవర్గంలో ఒక్కో గ్రామాన్ని నాలుగు నుంచి ఐదు సార్లు తిరిగిన అనుభవం తనకుందని, అలాంటి తన ప్రమేయం లేకుండా నియోజకవర్గంలో పర్యటిస్తూ వర్గవిభేదాలకు ఆద్యం పోస్తున్నారని ఆరోపించారు. తాను ఎక్కడా గ్రావెల్ గానీ, కాంట్రాక్ట్ పనులు గానీ, ఇసుక అక్రమ రవాణా గానీ, ఇతర అక్రమాలకు గానీ పాల్పడలేదని, అందుకు ఎక్కడైనా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, తాను నిస్వార్థ సేవకుడిగా నియోజకవర్గ ప్రజలకు, అభివృద్ధికి కృషి చేస్తానే తప్ప ఇతర కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటు రాజకీయాలు తనకు చేతకావని ఎమ్మెల్యే ఆదిమూలం తేల్చి చెప్పారు.
ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆవేదన