
ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనానికి యువకుడి బలి
తిరుపతి రూరల్: మండలంలోని సాయి నగర్‌లో నివాసముంటున్న ఓ యు వకుడు ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనానికి బానిసై మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. సాయినగర్‌లో నివాసముంటున్న అశోక్‌కుమార్ (25) తిరుపతి నగరంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసి, జీవనం సాగిస్తున్నా డు. దినసరి కూలీగా వెళ్లి వచ్చిన డబ్బులతో ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్‌లకు అలవాటు పడి అధిక అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెంది ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి అతని తండ్రి చంద్రబాబుకు తెలియజేయగా ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ ఎస్‌ఐ రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని శవపరీక్ష నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం దుకాణంలో చోరీ
రాపూరు: కోటూరుపాడు మార్గంలో ఉన్న మద్యం దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు మద్యం కేస్‌లను చోరీ చేసినట్లు నిర్వాహుకులు తెలిపారు. సోమవారం రాత్రి యథావిధిగా దుకాణానికి తాళాలు వేసి, వెళ్లామని, సిబ్బంది మంగళవారం ఉదయం షాపు తెరిచేందుకు రావడంతో తాళాలు పగలకొట్టి ఉండగా గుర్తించారు. షాపులోనికి వెళ్లి పరిశీలించగా 4 కేసుల 29 మద్యం సీసాలు, రూ.11,800 నగదు చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు నిర్వాహుకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అడ్వకేట్.. అడ్డంగా బుక్ అయ్యాడు!
తిరుపతి రూరల్:ఆన్‌లైన్‌లో ఫేక్ మెసేజ్‌లు పంపి, సైబర్ చోరీలకు పాల్పడే నేరగాళ్లకు ఓ అడ్వకేట్ అడ్డంగా చిక్కాడు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీ విద్యానగర్ కాలనీలో నివాసముంటున్న ఓ న్యాయవాది సెల్‌ఫోన్ నంబర్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆ తరువాత అదే నంబర్‌కు ఏపీకే అప్లికేషన్ పంపడం, ఆ అప్లికేషన్ ఓపెన్ చేయగా మూడు అకౌంట్లకు సంబంధించిన నగదు 8 అకౌంట్లకు బదిలీ కావడంతో సదరు అడ్వకేట్ కంగు తినాల్సి వచ్చింది. ఆ వెంటనే బ్యాంకు అధికారుల వద్దకు వెళ్లి బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ సైబర్ నేరగాళ్లు చాకచక్యంగా అడ్వకేట్ బ్యాంకు ఖాతాల నుంచి రూ.3.50 లక్షలు కాజేశారు. ఆ వెంటనే సదరు అడ్వకేట్ 1930కు ఫిర్యాదు చేయగా మిగతా బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేయించి, సైబర్ నేరగాళ్లు డబ్బులు డ్రా చేయకుండా చర్యలు తీసుకున్నారు. తిరుపతి రూరల్ సీఐ చిన్నగోవిందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.