
స్వచ్ఛతలో మరింత ముందుకు
తిరుపతి తుడా: స్వచ్ఛ తిరుపతి పరపతిని మరింత ఇనుముడింపజేసేందుకు అధికారులు సిబ్బంది కృషి చేయాలని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరారు. స్థానిక కచ్చపి ఆడిటోరియంలో మంగళవారం స్వచ్ఛత విజయోత్సవ సభ నిర్వహించారు. గత వారంలో స్వచ్ఛభారత్ మిషన్ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల్లో తిరుపతి సూపర్ స్వచ్ఛ లీగ్ అవార్డును కై వసం చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తిరుపతి అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నూతన భవనం పూర్తి చేసేందుకు మరింత సమయం పడుతుందని, భవన నిర్మాణానికి అవసరమయ్యే నిధులను ఇప్పట్లో కేటాయించలేమని ఆయన చెప్పారు. తిరుపతిని మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని, అవార్డు రావడం వెనుక అధికారుల కృషి, సిబ్బంది పనితీరు బాగుందని కొనియాడారు. అనంతరం కమిషనర్ మౌర్యాను గజమాలతో సత్కరించారు. హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్‌వైజర్లు, సిబ్బందిని వేదికపై సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, బొజ్జల సుధీర్ రెడ్డి, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.