
మా పిల్లలకు చదువు వద్దు
నారాయణవనం: విలీనాన్ని నిరసిస్తూ మండలంలోని తుంబూరు దళితవాడ బడికి తల్లిదండ్రులు మంగళవారం తాళం వేసి, ఎవరూ ప్రవేశించకుండా ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. మా ఊరి బడిలో మా పిల్లలు చదువుకునే అవకాశం లేనప్పుడు మా పిల్లలకు చదువు అవసరం లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇకపై టీచర్లు మా బడికి రావద్దంటూ పంపివేశారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ దళితవాడ ప్రాథమిక పాఠశాలలో 56 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం బడుల విలీనంలో భాగంగా దళితవాడ పాఠశాలను ఫౌండేషన్ స్కూల్‌గా మార్చిందన్నారు. మా ఊరి పిల్లలు 46 మందిని కేవలం 16 మంది మాత్రమే చదువుతున్న సమీపంలోని గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలకు పంపివేశారని పేర్కొన్నారు. గ్రామంలోని బడిలో పిల్లలు లేకుంటే దళితవాడ బడి పిల్లలను ఎలా పంపుతారని తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాల పునఃప్రారంభంలో మూడు సార్లు నిరసన తెలిపినా అధికారులు స్పందించలేదన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తే కేసులు పెడుతామని ఎంఈఓ హెచ్చరించడంతో మంగళవారం తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి, ఎవరూ లోపలికి ప్రవేశించకుండా ముళ్ల కంప వేశారు. పేద దళిత పిల్లల చదువు కోసం తామే స్వచ్ఛందంగా అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు పేర్కొన్నారు.
● బడికి ముళ్ల కంచె వేసిన తల్లిదండ్రులు