
జేసీ ఆదేశించినా..ఎంపీడీఓ కనికరించరా?
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ‘పంచాయతీ నిధులతో నిర్మించిన సిమెంటు రోడ్డుపై కంచె ఏర్పాటు చేసి ఓ ఇంటికి రాకపోకలు లేకుండా చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు.. తక్షణం ఆ గ్రామానికి వెళ్లి ఆ ఇంటికి అడ్డుగా నిర్మించిన ఇనుప కంచెను తొలగించండి.. ఆ దారిలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేయండి..’ అని జేసీ శుభం బన్సల్ ఎర్రావారిపాళెం ఎంపీడీఓ సీహెచ్ మదనమోహన్ రాజును ఆదేశించారు. అయినా ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. ఎర్రావారిపాళెం మండలం కమలయ్యగారిపల్లి పంచాయతీ బడగనపల్లిలో నివాసముంటున్న వెంకటరమణ ఇంటికి అదే గ్రామానికి చెందిన చరణ్‌కుమా ర్, మంజుల, రాజేశ్వరి దారి లేకుండా అడ్డుకోవడాన్ని సోమ వారం ప్రజా ఫిర్యాదుల విభాగంలో వినతిపత్రం అందించారు. తమ ఇంటికి వెళ్లడానికి వీలు లేకుండా పంచాయతీకి చెందిన సిమెంటు రోడ్డుపై ఇనుప కంచెను కట్టిన ఫొటోలు, సాక్షి పత్రికలో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లను చూపించారు. దీనిపై శుభం బన్సల్ వెంటనే స్పందించి ఎర్రావారిపాళెం ఎంపీడీఓ మదనమోహన్‌రాజుకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. బడగనపల్లిలో సమస్యను తక్షణం పరిష్కరించి తన కు ఫోన్ చెయాలని ఆదేశించారు. అయినా ఆ ఎంపీడీఓ ఏ మాత్రం లెక్క చేయకపోవడం, పైగా రాజకీయ ఒత్తిళ్లతో తా ను ఆ సమస్య పరిష్కరించలేనని బాధితుడు వెంకటరమణ కు చెప్పడం విశేషం. కాగా ఇనుప కంచెను తొలగించడానికి పోలీసులు ముందుకు వచ్చినా ఎంపీడీఓ ముఖం చాటేయడంతో వారు కూడా వెనుదిరిగి వెళ్లక తప్పలేదు. గత వారం రోజులుగా తమ ఇంటికి దారి లేకుండా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, ఆ దారిలో రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని బాధితులు కోరుతున్నారు.