
యోగా డేను విజయవంతం చేయండి
తిరుపతి అర్బన్ : యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన టెలికాన్ఫెరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని తారక రామారావు స్టేడియంలో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. జిల్లాలో 6200 ప్రాంతాల్లో యోగా నిర్వహించడం జరుగుతోందని స్పష్టం చేశారు. యోగా పూర్తయిన తర్వాత ఉదయం 10 గంటలలోపే ఆ కార్యక్రమం ఫొటోలు , వీడియోలను యాప్ నందు అప్‌లోడ్ చేయాలని తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న ప్రజాప్రతినిధులందరూ పాల్గొనేలా ప్రత్యేకంగా సంబంధిత అధికారులు వారిని ఆహ్వానించాలని సూచించారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుకు ఉచిత శిక్షణ
తిరుపతి సిటీ : ఎస్వీయూ ఎంప్లాయిమెంట్ కార్యాలయం ఆధ్వర్యంలో డొమెస్టిక్ డెటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ స్‌ఎస్సీ ఉత్తీర్ణత ఆపైన విద్యార్హతలు కలిగి 18 ఏళ్ల వయస్సు నుంచి 45 ఏళ్ల లోపు ఉన్న మహిళ, పురుష అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. 390 గంటల కాల వ్యవధిగల ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సు ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌తో పాటు మరిన్ని వివరాల కోసం 95338 89902 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
ఐటీఐలో రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తులు
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తిరుచానూరు రోడ్డు, పద్మావతీపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్/కన్వీనర్ పి.గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19 నుంచి జులై 15వ తేదీ సాయంత్రం 5గంటలలోపు ‘‘ఐటీఐ.ఏపి.జీఓవి.ఇన్’’ అనే వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను సమీపంలోని ఏదేని ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో పరిశీలన చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాలకు జులై 21, 22వ తేదీల్లో, 23 నుంచి 25వ తేదీల్లో ప్రైవేటు ఐటీఐలో ప్రవేశాలకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి అభ్యర్థులకు ఎటువంటి కాల్ లెటర్స్ పంపరని, పూర్తి వివరాలకు 94928 61369, 85000 21856, 94414 96103 నంబర్లలో సంప్రదించాలని కోరారు.