
తిరుమలలో కొనసాగుతున్న తనిఖీలు
తిరుమల : తిరుమలలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి టీటీడీ సీవీఎస్‌ఓ హర్షవర్ధన్‌రాజు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే మూడోరోజు మంగళవారం సైతం పోలీసులు, విజిలెన్స్, ఆరోగ్య, అగ్నిమాపక, విద్యుత్‌శాఖల అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. తిరుమలలోని పార్కులు, నిర్మానుష్య ప్రాంతాలు, భవన నిర్మాణాలను పరిశీలించారు. ఆయా చోట్ల కూలీలను ఆరా తీశారు. అనంతరం ఫొటో స్టూడియోలు, దుకాణాలను తనిఖీ చేశారు. అనధికార వ్యక్తులు కొండ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు.
టీటీడీ సీవీఎస్‌ఓగా మురళీకృష్ణ
తిరుమల : టీటీడీ ముఖ్య నిఘా, భద్రతాధికారి (సీవీఎస్‌ఓ)గా కేవీ మురళీకష్ణను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం విశాఖపట్నం, 16వ బెటాలియన్ కమాండెంట్‌గా మురళీకృష్ణ విధులు నిర్వర్తిస్తున్నారు.గతంలో ఆయన తిరుపతిలోని మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా, అదనపు ఎస్పీగా, తిరుమల అదనపు ఎస్పీగా అనంతరం అనంతపురం ఎస్పీగా, అనకాపల్లె ఎస్పీగా పనిచేయడం గమనార్హం.
అగ్ని ప్రమాదంలో
దంపతులకు గాయాలు
రేణిగుంట : మండలంలోని వెదుళ్లచెరువు ఎస్టీ కాలనీలో మంగళవారం సంభవించిన అగ్నిప్రమాదంలో భార్యాభర్తలు గాయపడ్డారు. వివరా లు.. కాలనీలో నివసిస్తున్న సుబ్బయ్య భార్య రాణి ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుంది. ఆమె కేకలు వేయడంతో కాపాడేందుకు సుబయ్య యత్నించగా ఆయనకు సైతం మంటలు తగిలాయి. ఈ ప్రమాదంలో రాణికి 60శాతం, సుబ్బయ్యకు 20శాతం శరీరం కాలిపోయింది. బాధితులను వెంటనే తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.
పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
సైదాపురం : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు పంచాయతీ కార్యదర్శి యజ్దానీబాషాను సస్పెండ్ చేస్తూ పీఆర్ కమిషనర్ వీఆర్ కృష్ణతేజ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. యజ్దానీబాషా గతంలో సైదాపురం పంచాయతీ కార్యదర్శిగా పనిచేసేప్పుడు రూ.20,33,646 ఉపాధి నిధులను నేరుగా విత్‌డ్రా చేసినందుకు సస్పెండ్ చేస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నాడు–నేడు పథకం కింద సచివాలయ భవనాల నిర్మాణం కోసం వెచ్చించిన ఉపాధి నిధులు పక్కదారి పట్టాయని ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేపట్టారు. దీనిపై కమిషనర్ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.

తిరుమలలో కొనసాగుతున్న తనిఖీలు