
పకడ్బందీ వసతికి ప్రత్యేక శ్రద్ధ
తిరుపతి అర్బన్ : జిల్లాలోని హాస్టళ్లలో పకడ్బందీగా వసతులు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వసతిగృహాల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. పలు హాస్టళ్లలో చేపట్టిన మరమ్మతు పనులను నాణ్యతా ప్రమాణాల మేరకు పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అలాగే విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని చెప్పారు. పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని స్పష్టం చేశారు. సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారం చూపుతామని తెలిపారు. సమావేశంలో ఎస్సీ హాస్టళ్ల అధికారి విక్రమకుమార్‌రెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి రాజేంద్రనాథ్‌రెడ్డి, అంబేద్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల డీసీఓ గీత, ఇంజినీరింగ్ అధికారి బాలసుబ్రమణ్యంరెడ్డి పాల్గొన్నారు.
గ్రీవెన్స్ అర్జీలకు ప్రాధాన్యం
గ్రీవెన్స్‌లో వచ్చే అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో జేసీ శుభం బన్సల్, డీఆర్‌ఓ నరసింహులతో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రతి సోమవారం వచ్చే అర్జీలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రీ ఓపెన్‌కు ఆస్కారం లేకుండా వినతులను పరిష్కరించాలన్నారు. మండల, డివిజన్ స్థాయిలోను తప్పకుండా ప్రతి సోమవారం గ్రీవెన్స్ నిర్వహించాలని స్పష్టం చేశారు. చిన్న చిన్న సమస్యలను మండల, డివిజన్ స్థాయిలోనే పరిష్కరించాలని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే దీపం పథకం ద్వారా అందిస్తున్న గ్యాస్ సిలిండర్లకు గడువులోపు రాయితీ నగదును వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. రేషన్ దుకాణాల్లో నాణ్యమైన సరుకులను కార్డుదారులకు పంపిణీ చేయాలని కోరారు. బియ్యంతోపాటు అన్ని రకాల సరుకులు అందించాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్టాండ్లను మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓలు తరచూ తనిఖీ చేయాలని సూచించారు. పంచాయతీల్లో ప్రతి రోజూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా డోర్ టూ డోర్ సేకరించాలని తెలిపారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోస్మాండ్ పాల్గొన్నారు.