
యూపీఎస్సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
తిరుపతి అర్బన్: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆయన పరీక్షల నిర్వహణపై డీఆర్వోతో కలసి మంగళవారం అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న జిల్లాలో 13 కేంద్రాల్లో 5,261 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30గంటల నుంచి 4.30 గంటల వరకు రెండు సెషన్స్‌లో పరీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించినట్లు తెలిపారు. బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని, ఎట్టి పరిస్థితుల్లోను విద్యుత్ అంతరాయం ఉండరాదని ఆయన ఆదేశించారు. అంతేకాకుండా తాగునీరు వసతి, టాయిలెట్స్ సక్రమంగా ఉండాలని, కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని తెలియజేశారు. ఈ సమావేశంలో తిరుపతి ఆర్డీవో రామమోహన్, తిరుపతి అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారి, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.