- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
- ఐసీఏఆర్–ఐఏఆర్‌ఐ’ డైరెక్టర్ డా. సీహెచ్ శ్రీనివాసరావుకు ‘స్వామి నాథన్ అవార్డు’ ప్రదానం
- శ్రీనివాస్‌రావుకు అవార్డు అందజేయడం ఆనందంగా ఉంది
హైదరాబాద్: హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రతిభ పురస్కారాన్ని వ్యవసాయ రంగంలో విశేష సేవలందించిన ‘ఐసీఏఆర్–ఐఏఆర్‌ఐ ’ డైరెక్టర్, వైస్ ఛాన్స్లర్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావుకు అందజేయడం ఆనందంగా ఉందని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రిటైర్డ్ ఐసీఏఆర్ ఉద్యోగుల సంఘం, నూజివీడు సీడ్స్ లిమిటెడ్ సంయుక్తంగా 2024–25 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక 9వ ‘ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్ అవార్డు’ పంపిణీ కార్యక్రమం శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) ఇనిస్టిట్యూట్‌లో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నూజివీడు సీడ్స్ లిమిటెడ్ చైర్మన్ మండవ ప్రభాకరరావు, రిటైర్డ్ ఐసీఏఆర్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్ రావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా ఎంఎస్ స్వామినాథన్ ప్రతిభా పురస్కారాన్ని వెంకయ్యనాయుడు.. డాక్టర్ శ్రీనివాసరావుకి ప్రదానం చేసి సత్కరించారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. వ్యవసాయం, పర్యావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని దేశానికి అవసరమైన విధానాలను రూపొందించడంలో శ్రీనివాస్‌రావు చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ దేశానికి మార్గదర్శకత్వం వహిస్తున్నందుకు ఈ పురస్కారం దక్కిందన్నారు. ప్రతిభకు గౌరవం ఇవ్వడం ద్వారా సమాజానికి ప్రేరణ కలుగుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో మండవ వెంకటరామయ్య చేసిన కృషిని స్మరించుకుంటూ, ఆయన స్థాపించిన విత్తన సంస్థను ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు.

వ్యవసాయం దేశ భవిష్యత్తుకు కీలకమని, యువత ఈ రంగంపై దృష్టి సారించాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ప్రకృతిని పరిరక్షించుకోవడం, పశుసంపదను కాపాడుకోవడం అవసరమని సూచించారు. వ్యవసాయం ల్యాబ్‌లకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయికి చేరాలని, శాస్త్రవేత్తల పరిశోధనలు రైతులకు అందాల్సిన అవసరం ఉందన్నారు. భూసార పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, రసాయన ఎరువుల అధిక వినియోగం భూమి నాణ్యతను దెబ్బతీస్తుందని హెచ్చరించారు.
అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. భారత గ్రీన్ రివల్యూషన్ శిల్పి ప్రొఫెసర్ స్వామినాథన్ జన్మ శతాబ్ది సందర్భంగా శ్రీనివాసరావుకు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. భారత వ్యవసాయాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడంలో ఎంఎస్ స్వామినాథన్ గారి పాత్ర గొప్పదని ఈ సందర్భంగా చెప్పారు. వ్యవసాయ శాస్త్రవేత్తల కృషి సాధారణ రైతులకు పూర్తిగా చేరడం లేదని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్‌లో భూమిని పరిరక్షించకపోతే గ్రీన్ రివల్యూషన్ ఫలితాలు ప్రతికూలమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నవారిని ప్రోత్సహించాలని, మంచి కార్యక్రమాలను కొనసాగించాలని మండవ ప్రభాకర్ రావును కోరారు.
వ్యవసాయానికి సేవ చేసిన వారికి గౌరవం దక్కుతుందని, క్లైమేట్ మార్పులకు తట్టుకునే వ్యవసాయం, సహజ వనరుల నిర్వహణలో డాక్టర్ శ్రీనివాసరావు చేసిన విశేష కృషికి ఈ అవార్డు లభించిందని నూజివీడు సీడ్స్ లిమిటెడ్ చైర్మన్ మండవ ప్రభాకరరావు అన్నారు. ఆయన దేశ వ్యాప్తంగా లక్షల హెక్టార్లలో వనరుల సంరక్షణ సాంకేతికతలను విస్తరించడం, జిల్లా స్థాయి కంటింజెన్సీ ప్రణాళికలను రూపొందించడం ద్వారా వ్యవసాయ స్థిరత్వం, ప్రతిఘటన సామర్థ్యాన్ని గణనీయంగా పెంచినట్లు తెలిపారు.


