లక్ష్మీకుమార్‌ నివాసంలో గుట్టలుగా నోట్ల కట్టలు, భారీగా బంగారం! | ACB Raids Hyderabad Water Board GM Anantha Lakshmikumar, Cash And Gold Worth Crores Seized In DA Case | Sakshi
Sakshi News home page

లక్ష్మీకుమార్‌ నివాసంలో గుట్టలుగా నోట్ల కట్టలు, భారీగా బంగారం!

May 20 2026 7:54 AM | Updated on May 20 2026 10:57 AM

Water Board GM Anantha Lakshmikumar Arrested in Assets Case

రూ. కోటికిపైగా నగదు, 2 కిలోల బంగారం!

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన హైదరాబాద్‌ జలమండలి అధికారి.. అనంత 

లక్ష్మీకుమార్‌ నివాసంలో గుట్టలుగా నోట్ల కట్టలు, భారీగా బంగారం లభ్యం 

 రూ. 5.88 కోట్ల విలువైన అక్రమాస్తుల గుర్తింపు..

మల్లాపూర్‌/నాంపల్లి: హైదరాబాద్‌ జలమండలిలో ఓ భారీ అవినీతి జలగ ఏసీబీకి చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై హైదరాబాద్‌ మహానగర నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ సంస్థ (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ) రెడ్‌హిల్స్‌ డివిజన్‌ జనరల్‌ మేనేజర్‌ సగ్గం అనంత లక్ష్మీకుమార్‌ (58) నివాసం సహా బంధువులు, స్నేహితులు, బినామీలు, ఇతర సహచరులకు చెందిన 8 ప్రదేశాల్లో ఏసీబీ డీఎస్పీ మజీత్‌ అలీఖాన్‌ ఆధ్వర్యంలో 16 గంటలపాటు సోదాలు జరిగా యి.

 హైదరాబాద్‌ మల్లాపూర్‌లోని వెంకటరమణ కాలనీలో ఉన్న అనంత లక్ష్మీకుమార్‌ నివాసంలో చేపట్టిన తనిఖీల్లో కళ్లు చెదిరే స్థాయిలో ఏకంగా రూ. 1.10 కోట్ల నగదు, 2.1 కేజీల బంగారం, 9.2 కేజీల వెండి లభ్యమైంది. అలాగే నిజామాబాద్, సంగారెడ్డిలో 18 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో 6 ఓపెన్‌ ప్లాట్లు, 3 ఇళ్లు, మారుతీ కారు, బజాజ్‌ మోటార్‌ బైక్‌ సహా మొత్తం రూ. 5.88 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అనంత లక్ష్మీకుమార్‌ భార్య రాధమ్మ పేరిట మూడు బ్యాంకు లాకర్లలో భద్రపర్చిన ఆభరణాలు, ఇళ్ల పత్రాలను కూడా ఏసీబీ అధికారులు తెరిపించి స్వా«దీనం చేసుకున్నారు. రెడ్‌హిల్స్‌లోని హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించి కొన్ని రికార్డులను తీసుకెళ్లారు. 

ఆయా ఆస్తుల మార్కెట్‌ విలువ చాలా రెట్లు ఎక్కువగా ఉండొచ్చని అధికారులు తెలిపారు. అనంత లక్ష్మీకుమార్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. ఆయన్ను బంజారాహిల్స్‌లోని సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ (సీఐయూ)కు తరలించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు ఫిర్యాధు చేయాలని సూచించారు. ఫిర్యాధుల వివరాలు పూర్తింగా గోప్యంగా ఉంచుతామన్నారు. కాగా, నోట్ల కట్టలను లెక్కించేందుకు తీసుకొచ్చిన కౌంటింగ్‌ మెషీన్లు కాసేపు మొరాయించాయి. సోదాల్లో 15 మంది అధికారులు పాల్గొన్నారు. 

ఉలిక్కిపడిన మల్లాపూర్‌...: మల్లాపూర్‌ వెంకరమణ కాలనీలో ఏసీబీ తనిఖీలు జరుగుతున్నట్లు టీవీల్లో చూసి ఉలిక్కిపడిన స్థానికులు.. ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి అనంత లక్ష్మీకుమార్‌ నివాసం వద్ద గుమిగూడారు. గత నెలలో చిన్న కుమార్తె వివాహాన్ని ఆయన ఆరంఘర్‌ సమీపంలో అంగరంగ వైభవంగా చేశారని చర్చించుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement