పట్టుబడిన మావోయిస్టులు, సానుభూతిపరులు.. వైద్యం కోసమా? యాక్షన్‌ కోసమా!?

Warangal Police Arrested 2 Maoists 3 Sympathisers From Chhattisgarh - Sakshi

సాక్షి, వరంగల్‌: ఛత్తీస్‌గఢ్‌నుంచి మావోయిస్టులు వరంగల్‌ నగరానికి ఎందుకు వచ్చారు..? వైద్యం కోసం వస్తే గుట్టుచప్పుడు కాకుండా ఒక్కరో ఇద్దరితోనే ఆస్పత్రికి రావాలి.. మరి బొలెరో వాహనంలో ఐదుగురు ఎందుకు వచ్చినట్లు? వెంట పేలుడు పదార్థాలు ఎందుకు ఉన్నాయి? వీటన్నింటిని పరిశీలిస్తే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్బన్‌ నక్సల్స్‌ విస్తరణలో భాగంగా నగరంలో పాగా వేసేందుకు ప్రయత్నించారా? మరేదైనా యాక్షన్‌కు ప్లాన్‌ చేశారా? అన్న చర్చ జరుగుతోంది.

సీపీఐ మావోయిస్టు పార్టీ ఛత్తీస్‌గఢ్‌ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్న మావోయిస్టులు సోమవారం వరంగల్‌ పోలీసులకు చిక్కడం ఉమ్మడి జిల్లాలో సంచలనంగా మారింది. ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమాలకు కంచుకోటలాంటి వరంగల్‌లో కొన్నేళ్లుగా ఆ పార్టీ కార్యకలాపాలు కనుమరుగయ్యాయి. ఈ సమయంలో ఇద్దరు మావోయిస్టులతోపాటు ముగ్గురు సానుభూతిపరుల అరెస్ట్‌ కలకలం రేపింది.  

మడకం ఉంగి అనేక కేసుల్లో నిందితురాలు..
పోలీసులకు చిక్కిన మడకం ఉంగి అలియాస్‌ కమల వ్యవసాయ కుటుంబ నేపథ్యం కలిగిన మహిళా మావోయిస్టు. విప్లవ సాహిత్యం, ప్రసంగాలు, పాటలకు ఆకర్షితురాలై 2007 వరకు బాలల సంఘంలో పనిచేసి, 2011లో ముసాకి చంద్రు నాయకత్వంలో మిలీషియా సభ్యురాలిగా పనిచేసింది. అదే ఏడాది పామెడు ఎల్‌జీఎస్‌ కమాండర్‌ బొద్దె కిషన్‌ అధ్వర్యంలో ఎన్డీఎస్‌ సభ్యురాలిగా పనిచేసింది. 9వ ప్లాటూన్‌లో, 2012 సంవత్సరంలో సౌత్‌ సబ్‌ జోనల్‌ బ్యూరో టీం ఇన్‌చార్జ్‌గా నియమితులైంది. వివిధ ఘటనల్లో గాయపడిన మావోయిస్టులకు చికిత్స అందించేది.

2017 ఏప్రిల్‌లో చింతగుప్ప పోలీస్‌స్టేషన్‌ బుర్కా పాల్‌ ఆటవీ ప్రాంతంలో దాడిచేసి 25మంది పోలీసులను హత్య చేసిన çఘటనలో నిందితురాలు. 2018లో మినప అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసులను హత్యచేసి మరో ఆరుగురిని తీవ్రంగా గాయపర్చిన సంఘటన, 2020 మార్చిలో చింతగుప్ప పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మినప అడవి ప్రాంతంలో 17మంది, 2021లో బెటాలియన్‌ కమాండర్‌ హిడ్మా, సాగర్‌ నాయకత్వంలో గుట్టపరివార ప్రాంతంలో ఆడవిలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న 24మంది బీజాపూర్‌ పోలీసులను హత్యచేసిన çఘటనల్లో నిందితురాలు.

మరో మావోయిస్టు అసం సోహెన్‌ ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ప్రసంగాలు, పాటలకు ఆకర్షితుడై పార్టీలో చేరాడు. 2019లో మావోయిస్టు పార్టీ కార్యదర్శి, నేషనల్‌ పార్క్‌ ఏరియా సెక్రటరీ దిలీప్‌ వింజ ఆధ్వర్యంలో సభ్యుడిగా నియామకమయ్యాడు. బీడీ ఆకుల కాంట్రా క్టర్లు, ఇతర సంపన్న వ్యక్తులనుంచి పార్టీ ఫండ్‌ పే రుతో డబ్బు వసూలు చేసి పార్టీకి అవసరమైన ని త్యావసరాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేసి అందజేసేవాడు. దీంతోపాటు పేలుడు పదార్థాలను వరంగల్, కరీంనగర్‌ ప్రాంతాలనుంచి రహస్యంగా కొనుగోలు చేసి మావోయిస్టు పార్టీకి చేరవేసేవాడు. వీరితోపాటు మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘ్‌ అధ్యక్షురాలు మీచ అనిత (21), (భూపాలపట్నం తాలూకా కండ్లపర్తి గ్రామం), ఆర్పీసీ సభ్యుడు గొడ్డి గోపాల్‌ (భూపాలపట్నం తాలూకా వరదల్లి గ్రామం), భూపాలపట్నం తాలూకా నల్లంపల్లికి చెందిన కందగుర్ల సత్యం ఉన్నారు. 


మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, సెల్‌ఫోన్లు, నగదు

ఛత్తీస్‌గఢ్‌ టు వరంగల్, వయా ములుగు
మావోయిస్టుల అరెస్టుకు సంబంధించి వరంగల్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అశోక్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు. ఈ మేరకు అరెస్టయిన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం భూపాలపట్నం తాలూకా నుంచి ములుగు జిల్లా మీదుగా వరంగల్‌ నగరానికి చేరినట్లు తెలుస్తోంది. విశ్వసనీయవర్గాల సమాచారం, ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఆదివారం సాయంత్రం సమయంలో ములుగు రోడ్డు అజర హాస్పిటల్‌ ప్రాంతంలో వరంగల్‌ టాస్క్‌ఫోర్స్, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బొలెరో కారులో వస్తూ పట్టుబడ్డారు.

ఇద్దరు మహిళలు, డ్రైవర్‌తో సహా మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారంతా నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులు, సానుభూతిపరులుగా గుర్తించారు. వారినుంచి 50 జిలిటెన్‌ స్టిక్స్, 50 డిటోనేటర్లు, రూ.74వేల నగదు, విప్లవ సాహిత్యం, ఒక బొలెరో కారు, సెల్‌ఫోన్లు, ఆధార్, ఎన్నికల గుర్తింపు కార్డులను స్వా«ధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. నక్సలైట్లను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ వైభవ్‌ గైక్వాడ్, ఏసీపీ జితేందర్‌ రెడ్డి, హనుమకొండ ఏసీపీ కిరణ్‌ కుమార్, హనుమకొండ ఇన్‌స్పెక్టర్‌లు సురేశ్‌ కుమార్, శ్రీనివాస్‌జీ, హనుమకొండ ఎస్‌ఐలు, ఇతర సిబ్బందిని సెంట్రల్‌ డీసీపీ అభినందించారు.   


పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టులు, సానుభూతిపరులు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top