
పాశమైలారం(సంగారెడ్డి జిల్లా): పాశమైలారం సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలి పలువురు మృత్యువాత పడటంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా దురుదృష్టకర సంఘటన అని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. పాశమైలారం సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లిన ఆయన మాట్లాడుతూ.. ‘ సిగాచి పరిశ్రమ ఫార్మా కంపెనీలకు మెటీరియల్ సప్లై చేస్తుంది. ఇప్పటివరకూ 42 మృతదేహాలు లభించాయి. ఇంకా కొంతమంది ఆచూకీ కనిపించడం లేదు.
గతంలో కూడా ఓ పరిశ్రమంలో షార్ట్ సర్క్యూట్ వల్ల 11 మంది చనిపోయారు. అధికారులతో ఒక బృందం ఏర్పాటు చేయాలి.జ పరిశ్రమల్లో తనిఖీలు లంచాల కోసం జరుగుతున్నాయా?, నామ్ కి వాస్తు ప్రకారం జరుగుతున్నాయా? అని ప్రభుత్వం ఆలోచించాలి. ప్రమాద బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పొట్ట కూటి కోసం వచ్చి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఇంతమంది చనిపోవడం బాధాకరం.
సిగాచి వారికి మరో 3 పరిశ్రమలు ఉన్నాయి. ఇప్పటికైనా అన్నింటినీ తనిఖీ చేయాలి. మృతుల జాబితా వచ్చిన తర్వాత ఆయా రాష్ట్రాల వారికి మా పార్టీ అండగా ఉంటుంది. మిస్ అయిన వారి ఆచూకీని ప్రభుత్వం త్వరగా తెలుసుకోవాలి. పరిశ్రమల ప్రాంతంలో కచ్చితంగా అంబులెన్స్ ఉండే విధానం చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహకరిస్తాం. శిథిలాల కింద మృతదేహాల కోసం పోలీస్ డాగ్స్‌ను కూడా ఉపయోగించాలి. చనిపోయిన కుటుంబాల సభ్యులు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతామంటే సహకరిస్తాం. ఇది రాజకీయాలు చేసే సమయం కాదు’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.