పెట్టుబడులు ఉపసంహరణతో నష్టం లేదు

Union Minister Anurag Tagore Said There Was No Loss With Withdrawal Of Investment - Sakshi

కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

సాక్షి, హైదరాబాద్‌: నీతి ఆయోగ్ సూచనతోనే దేశవ్యాప్తంగా కంపెనీల నుంచి పెట్టుబడులు ఉపసంహరణ చేస్తున్నామని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, కంపెనీల పనితీరుపై ఎప్పటికప్పుడు కేంద్రం అంచనా వేస్తోందని పేర్కొన్నారు. ఏ కంపెనీ ప్రజలకు ఉపయోగపడుతుందో పరిశీలిస్తుందని.. అన్ని కంపెనీలను ప్రైవేటుపరం చేస్తామన్నది కరెక్ట్ కాదని ఆయన చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఎవరికీ నష్టం లేదన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటేజేషన్ ద్వారా ఉద్యోగులకు, కంపెనీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగం ఉందన్నారు. (చదవండి: ఘోర అన్యాయం: కేంద్రానికి ఘాటు లేఖ)

మెట్రో, వాటర్, విద్యా రంగానికి చాలా కేటాయింపులు చేశామని.. తాముచ్చిన హామీ మేరకు పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చామని పేర్కొన్నారు. నిధుల కోసం గత ఐదు నెలలుగా ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడానని తెలిపారు. పోలవరం కోసం ఏపీ ఆర్థిక మంత్రితో మాట్లాడి, అగ్రిమెంట్ మేరకు నిధులు కూడా కేటాయించామని చెప్పారు. కేంద్ర నిర్ణయంతో ఏపీ, తెలంగాణకు అనేక ప్రాజెక్టులు కేటాయించామని తెలిపారు.(చదవండి: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ రాజీనామా)

‘‘తెలంగాణలో 9172.90 వేలకోట్లకు పైగా నిధులు కేటాయించాం. ఆ రాష్ట్రానికి 400 కోట్లు ప్రతిఏటా ఆత్మనిర్భర భారత్ కింద వస్తాయి. ప్రపంచం మొత్తం కరోనాను ఎదుర్కొంది. భారత్ కరోనాను సమర్థంగా ఎదుర్కొంది. ఆపదలోనే అవకాశాలను వెతుక్కోవాలని ప్రధాని మోదీ అన్నారు. రెండు వ్యాక్సిన్లను తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. అనేక రంగాలకు ప్రధాని చేయూతనిచ్చారు. పేదలకు ఆహార భద్రత కల్పించాం. ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సాయం అందించాం. ఆర్థికంగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఇబ్బందుల్లో ఉన్నా బడ్జెట్‌లో ఆరోగ్యం కోసం అదనపు కేటాయింపులు చేశాం. రైతులకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పెంచేందుకు అగ్రిసెస్‌ వసూలు చేస్తున్నామని’ అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top