
సాక్షి, హైదరాబాద్: చరిత్రాత్మకమైన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం 4 గంటలకు వేదమంత్రోచ్ఛరణల మధ్య ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ద్వారాలు తెరిచారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలిపూజ చేసి బోనం సమర్పించారు. అనంతరం సాధారణ భక్తులకు అమ్మవారిని దర్శించుకునేందుకు అనుమతించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమ్మవారికి పట్టు వ్రస్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంకు ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఈటల రాజేందర్ దర్శించుకున్నారు. అనాదిగా హైదరాబాద్‌లో బోనాల పరంపర కొనసాగుతుందన్నారు.
ఈ నెల 13, 14 తేదీల్లో అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేశారు. ఆదివారం బోనాలు, సోమవారం రంగం కార్యక్రమంలో భాగంగా భవిష్యవాణి ఉంటుంది. తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొనే బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.
అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ఆరు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇందులో రెండు క్యూలైన్లు బోనాలతో వచ్చే మహిళల కోసం, ఒకటి వీఐపీ పాస్‌లతో వచ్చే వారికి, మిగతావి సాధారణ భక్తులకు కేటాయించారు. బోనాలతో వచ్చే మహిళలతోపాటు ఐదుగురు కుటుంబ సభ్యులను అనుమతిస్తారు. దేవదాయ శాఖ అధికారులు దేవాలయం మొత్తం రంగులు, పువ్వులు, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులు 24 గంటలు పారిశుధ్య పనులు నిర్వహించేలా సిబ్బందిని నిమించారు.
మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. జలమండలి అధికారులు ఐదు ప్రాంతాల్లో మంచినీటి శిబిరాలను ఏర్పాటు చేసి వాటర్‌బాటిళ్లు, మంచినీటి ప్యాకెట్లు అందించనున్నారు. మహంకాళి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో డీఎంఅండ్‌హెచ్‌వో ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి డాక్టర్లను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల కోసం అంబులెన్స్‌లను సిద్ధంగా పెట్టారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో భక్తులను అలరించేందుకు ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేసి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కళాకారులతో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
శివసత్తులు, జోగినుల కోసం అధికారులు ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు వారికి ప్రత్యేకంగా అనుమతిస్తారు. ఆ సమయంలో తమ సంప్రదాయ పద్ధతిలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చు. బాటా వైపు నుంచి క్యూలైన్లలో కాకుండా నేరుగా ఆర్చ్ గేటు వరకు అనుమతిస్తారు.