పండుగ ప్రయాణంపై ‘డైనమిక్‌’ పిడుగు  | TSRTC increased fares in special buses | Sakshi
Sakshi News home page

పండుగ ప్రయాణంపై ‘డైనమిక్‌’ పిడుగు 

Jan 14 2024 2:10 AM | Updated on Jan 14 2024 10:35 AM

TSRTC increased fares in special buses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి వేళ దూర ప్రాంతాల్లోని సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులపై తెలంగాణ ఆర్టీసీ ‘డైనమిక్‌ చార్జీ’ రూపంలో పెను భారం మోపింది. దాదాపు రెట్టింపు చార్జీలతో జేబులు గుల్ల చేస్తోంది. గతంలో పండుగ సమయంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు రుసుము వసూలు చేసే విధానం ఉండేది. కానీ ఇటీవల దాన్ని రద్దు చేసి సాధారణ చార్జీలకే ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు ఆర్టీసీ కల్పించింది. కానీ సంక్రాంతి వేళ.. డైనమిక్‌ ఫేర్‌ విధానం పేరిట.. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా అదనపు రుసుము వసూలు చేస్తోంది.  

విశాఖ స్పెషల్‌ రూ.3 వేలు 
వాస్తవానికి కొన్ని నెలలుగా దశల వారీగా డైనమిక్‌ ఫేర్‌ విధానాన్ని విస్తరిస్తూ వచ్చిన టీఎస్‌ఆర్టీసీ.. సంక్రాంతి రద్దీ సమయానికి దూరప్రాంత రూట్లను కూడా ఈ విధానంలోకి తెచ్చేసింది. ఫలితంగా పండుగ ప్రత్యేక బస్సుల్లో చార్జీలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సాధారణ రోజుల్లో విశాఖపటా్ననికి స్లీపర్‌ బస్సులో టికెట్‌ ధర రూ.1,500 లోపు ఉండగా, ఇప్పుడు ప్రత్యేక బస్సుల్లో అది రూ.3 వేలను దాటింది. విజయవాడ మార్గంలో సూపర్‌ లగ్జరీ బస్సుల్లో రూ.300, రాజధానిలో రూ.550, గరుడలో రూ.800 వరకు చార్జీలు పెరిగాయి. మిగతా దూరప్రాంతాల మార్గాల్లోని బస్సుల్లోనూ ఇదే బాదుడు కనిపిస్తోంది.  

డిమాండ్, ముందు.. వెనుక సీట్లను బట్టి చార్జీలు 
డిమాండ్‌ పెరిగే కొద్దీ చార్జీలను సవరించి పెంచుకోవటాన్నే డైనమిక్‌ ఫేర్‌ విధానం అంటున్నారు. సాధారణంగా విమానయాన సంస్థలు దీన్ని అను సరిస్తుంటాయి. నెల రోజుల ముందు బుక్‌ చేసుకునే విమాన టికెట్‌ ధరకు, అదేరోజు బుక్‌ చేస్తే ఉండే చార్జీకి పొంతనే ఉండదు. మూడు నాలుగు రెట్లు కూడా చార్జీ పెరుగుతుంది. ఇదే విధానాన్ని తెలంగాణ ఆర్టీసీ అనుసరిస్తోంది. తొలిసారిగా గతేడాది బెంగళూరు మార్గంలో దీనిని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఆ తర్వాత విస్తరిస్తూ తాజాగా ఇతర రాష్ట్రాల రూట్లలో అమలు ప్రారంభించింది.

సాధారణ రోజుల్లో డిమాండ్‌ ఉండక బస్సుల్లో సీట్లు మిగిలిపోతుంటాయి. అలాంటి సమయంలో సాధారణ టికెట్‌ ధరలో 80% మొత్తాన్నే వసూలు చేస్తోంది. అంటే రూ.100గా ఉండే టికెట్‌ ధరను రూ.80గా మారుస్తోంది. కానీ డిమాండ్‌ పెరిగే కొద్దీ టికెట్‌ ధరలను క్రమంగా పెంచుతూ గరిష్టంగా 150 శాతంగా ఖరారు చేస్తోంది. ఇక ముందు వైపు ఉండే సీట్లలో ఒక ధర, వెనక సీట్లలో మరో ధర, కిటికీ వైపు సీటుకు ఓ ధర, పక్క సీటుకు మరో ధర, ఉదయం వేళ ఒక ధర, సాయంత్రం, రాత్రి వేళ వేరు ధరలు.. ఇలా ఎప్పటికికప్పుడు సందర్భాన్ని బట్టి చార్జీలను సవరిస్తోంది.

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల్లో కూడా ఈ విధానం అనుసరిస్తున్నారు. డిమాండ్‌ లేని సాధారణ రోజుల్లో చార్జీలో సగం మాత్రమే వసూలు చేస్తుండటంతో ఆ బస్సులు నిండిపోయి ప్రయాణిస్తుంటాయి. అదే సమయంలో ఆర్టీసీ బస్సులు ఖాళీగా కన్పిస్తుంటాయి. ఇక డిమాండ్‌ ఎక్కువగా ఉన్న సమయంలో రెండు మూడు రెట్లకు టికెట్‌ ధర పెంచి ప్రైవేటు ట్రావెల్స్‌ వసూలు చేస్తుంటాయి. ఈ విధానం లాభసాటిగా ఉండటంతో తెలంగాణ ఆర్టీసీ కూడా దీన్ని అమల్లోకి తెచ్చింది.  

ఆదుకున్న ఏపీఎస్‌ ఆర్టీసీ 
సాధారణంగా సంక్రాంతి, దసరా, దీపావళి పండగ వేళల్లో హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది. 15 లక్షల నుంచి 20 లక్షల మంది తరలి వెళ్తారు. దీంతో ఏపీకి టీఎస్‌ఆర్టీసీ అదనంగా బస్సులు నడుపుతుంది. అలా ఈ సంక్రాంతికి 1,550 బస్సులను ఏపీకి తిప్పాలని భావించింది. కానీ మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావటంతో రద్దీ విపరీతంగా పెరిగి బస్సులు సరిపోని పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో నామమాత్రంగా 400 అదనపు బస్సులతో సరిపెట్టింది.

ఇదే సమయంలో ఏపీఎస్‌ ఆర్టీసీ హైదరాబాద్‌ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు 1,450 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. అవి సరిపోక పోవడం ఎంజీబీఎస్, జేబీఎస్‌లకు ప్రయాణికులు పొటెత్తుతుండటంతో మూడు రోజుల క్రితం ప్రత్యేక బస్సుల సంఖ్య పెంచాల్సిందిగా ఏపీఎస్‌ ఆర్టీసీ ఉన్నతాధికారులను టీఎస్‌ఆర్టీసీ అధికారులు కోరారు. దీంతో గత మూడు రోజులుగా మరో 350 ప్రత్యేక బస్సులను ఏపీఎస్‌ ఆర్టీసీ రంగంలోకి దించింది.  

ప్రైవేటు బస్సు చార్జీలూ భగ్గు 
తెలంగాణ ఆర్టీసీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 4,420 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. దక్షిణమధ్య రైల్వే విశాఖ, కాకినాడ, తిరుపతి, నర్సాపూర్, తదితర ప్రాంతాలకు రద్దీకనుగుణంగా అదనపు రైళ్లను ఏర్పాటు చేసింది. ఇవి ఏ మూలకూ చాలటం లేదు. దీంతో ప్రయాణికులు ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. ట్రావెల్స్‌ నిర్వాహకులు పెరిగిన డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని చార్జీలను పెంచేశారు.  

వైజాగ్, అమలాపురం, కాకినాడ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో రూ.950 నుంచి రూ.2000 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. విశాఖపటా్ననికి నగరం నుంచి సాధారణ రోజుల్లో రూ.1300గా ఉండే స్లీపర్‌ బస్సు చార్జీ ఇప్పుడు రూ.4000 వరకు చేరుకుంది. రాజమండ్రికి రూ.3,800 వరకు, విజయవాడకు రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement