Telangana : గురుకులాలు తెరిచేందుకు గ్రీన్‌సిగ్నల్‌

TS HC Okay To Reopen Gurukula Schools - Sakshi

4 వారాల తర్వాత పరిస్థితిని సమీక్షిస్తాం: హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ, ఇతర గురుకులాలను తెరిచేందుకు హైకోర్టు అనుమతించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ గురుకుల పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించవచ్చని స్పష్టంచేసింది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు భౌతికంగా తరగతులను నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల్లోని విద్యార్థులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే తరగతుల నిర్వహణకు అనుమతినిస్తున్నట్లు పేర్కొంది. కేరళ సహా పలు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కోవిడ్‌ అదుపులో ఉందని.. నియంత్రణ చర్యలు బాగున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఈ మేరకు ప్రభుత్వ గురుకులాలు తెరవరాదంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. భౌతికంగా పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించాలంటూ గత ఆగస్టు 24న ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌చేస్తూ అధ్యాపకుడు ఎం.బాలకృష్ణ దాఖలుచేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం మరోసారి విచారించింది. గురుకులాల్లో కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు. ప్రైవేటు హాస్టళ్లతో పోలిస్తే ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకులాల్లో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు.

ఇంటర్మీడియట్‌ పరీక్షల నేపథ్యంలో తరగతుల నిర్వహణకు అనుమతినివ్వాలని కోరారు. గురుకులాలు తెరిచేందుకు తమకు అభ్యంతరం లేదని, అయితే కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని, నాలుగు వారాల తర్వాత పరిస్థితిని సమీక్షించాలని పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ నివేదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. గురుకులాల నిర్వహణపై స్థాయీ నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్‌ 29కి వాయిదా వేసింది. కాగా, గురుకులాలు తెరవరాదంటూ హైకోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఆర్థికం గా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని, ఈ ఉత్తర్వులను సవరించాలని ప్రభుత్వం హైకోర్టులో మధ్యంతర పిటిషన్‌ దాఖలుచేసిన విషయం తెలిసిందే.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top