11న ఎంసెట్‌ రెండో విడత డౌటే!

TS EAMCET 2022 Second Phase Counselling - Sakshi

రెండో దశ కౌన్సెలింగ్‌ నిర్వహణపై అనుమానాలు

తేలని ఫీజుల వ్యవహారం

ఫీజు పెంపో? తగ్గింపో? చెప్పలేని స్థితిలో ఎఫ్‌ఆర్‌సీ

సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 11న జరగాల్సిన ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహణపై సాక్షాత్తు అధికారులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి వాయిదా పడే అవకాశముందని భావిస్తున్నారు. ఫీజుల వ్యవహారంలో పీటముడి వీడకపోవడమే దీనికి కారణమంటున్నారు. వాస్తవానికి విద్యార్థులకు మొదటి విడత కౌన్సెలింగ్‌ కన్నా, రెండో విడత అత్యంత కీలకం. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌ ర్యాంకులపై దాదాపు స్పష్టత వస్తుంది. జాతీయ కాలేజీల్లో కోరుకున్న బ్రాంచ్‌ రాని విద్యార్థులు రాష్ట్రంలోని ప్రముఖ కాలేజీల్లో సీట్ల కోసం ప్రయత్నిస్తారు.

కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల్లో సీట్లు పెరగడంతో గత కౌన్సెలింగ్‌లో సీటు వచ్చినా వదిలేసుకున్న విద్యార్థులు కూడా రెండో దశపై ఆశలు పెట్టుకుంటారు. ఇతర బ్రాంచీల్లో సీట్లు పొందిన విద్యార్థులు కూడా కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులు పొందేందుకు ఈ దశ కౌన్సెలింగ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. కొంతమంది విద్యార్థులు ఈ కౌన్సెలింగ్‌ తర్వాత డిగ్రీ కాలేజీల్లో చేరే అవకాశం ఉంది.

ఫీజుల నిర్ణయం తేలేనా?
ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల వ్యవహారంలో రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్‌ఆర్‌సీ) దోబూచులాడుతోందన్న విమర్శలొస్తున్నాయి. జూలైలో కాలేజీల ఆడిట్‌ రిపోర్టులు పరిశీలించి, కొత్త ఫీజులు నిర్ణయించిన ఎఫ్‌ఆర్‌సీ అంతలోనే యూటర్న్‌ తీసుకుంది. ఆడిట్‌ నివేదికలు సరిగ్గా పరిశీలించలేదని భావించడం, మళ్లీ కాలేజీలను పిలిచి ఆడిట్‌ నివేదికలను ఆమూలాగ్రం పరిశీలించడం, తర్వాత కొన్ని కాలేజీల ఫీజులు తగ్గించడం అనేక సందేహాలకు తావిస్తోంది. రెండోసారి ఆడిట్‌ నివేదికల్లో కన్పించిన తప్పులు మొదటిసారి ఎందుకు గుర్తించలేకపోయారనే అనుమానాలు అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.

ఫీజులు తగ్గించామని చెబుతున్నప్పటికీ.. 2019తో పోలిస్తే ఎక్కువ కాలేజీల ఫీజులు పెరిగాయని పలువురు అంటున్నారు. రెండుసార్లు పరిశీలించినా, మరోసారి సంప్రదింపులకు 20 కాలేజీలను పిలవడం, ఆ తర్వాత ఏం చేయబోతున్నారో స్పష్టత ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఫీజుల వ్యవహారంపై ఎటూ తేల్చకపోవడంతో ఈ ప్రభావం రెండో దశ కౌన్సెలింగ్‌పై పడే అవకాశముంది. ఇలా జాప్యమైతే ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ ఈసారి కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top