Hyderabad: బిర్యానీ పాషా అరెస్టు

Thief Biryani Pasha Arrested In Chanda Nagar At Hyderabad - Sakshi

చందానగర్‌:  ఏ దొంగతనానికి వెళ్లినా సెంటిమెంట్‌గా ఒకే కారు వాడడం ఆ దొంగ ప్రత్యేకత. రెండు సార్లు జైలుకు వెళ్లి వచ్చినా అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. బంగారు దుకాణాలు, ఫర్టిలైజర్‌ దుకాణాలు, తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను చందానగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో డీసీపీ వేంకటేశ్వర్లు, ఏసీపీ కృష్ణప్రసాద్‌ ఈ వివరాలు వెల్లడించారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా రాంనగర్‌కు చెందిన సయ్యద్‌ మహబూబ్‌ పాషా అలియాస్‌ బిర్యానీ పాషా (39) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ అదే జిల్లాలోని సత్తాపూర్‌ గ్రామంలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. చోరీ చేయాలనుకున్న ప్రాంతంలో రెక్కీ నిర్వహించి ఓయో రూమ్‌ బుక్‌ చేసుకొని చోరీ చేసేవాడు. గడ్డపారలతో తాళం బద్దలు కొట్టి అక్కడ ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బు దొంగతనం చేసేవాడు.  వచ్చిన డబ్బులతో కార్లు కొనుగోలు చేసి జల్సాగా తిరుగుతుండేవారు.

  • ఈ క్రమంలో  పట్టుబడి జైలుకు కూడా వెళ్లివచ్చాడు. రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చినా.. పీడీ యాక్ట్‌ నమోదైనా మారలేదు. ఈనెల 9న ఉదయం చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తారానగర్‌ తుల్జా భవానీ మందిర్‌ వద్ద ఉన్న తన జ్యువెలరీ దుకాణంలో చోరీ జరిగినట్లు సయ్యద్‌ పర్వీనా రెహన్‌ గుర్తించారు. దీంతో బాధితురాలు  పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దుకాణంలో రూ.3.50 లక్షల నగదు, 15 తులాల బంగారం, 10 కేజీల వెండి ఆభరణాలు పోయాయని  ఫిర్యాదు చేసింది.  
  • మంగళవారం లింగంపల్లి గుల్‌ మొహర్‌ పార్కు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా సయ్యద్‌ మహబూబ్‌ పాషా కారులో వస్తున్నాడు. అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు.  
  • అతనిని రిమాండ్‌కు తరలించి అతనివద్ద 3.5 తులాల బంగారం, 10 కిలోల వెండి వస్తువులు, రూ.35 వేల నగదు, నాలుగు కార్లు, సిగరెట్‌ ప్యాకెట్లుపోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
    చదవండి: 2007లో కేసు నమోదు.. అజ్ఞాతంలోకి వెళ్లిన శ్రీనివాసరావు
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top