
అక్కడి కాంగ్రెస్ నేత ఇంట్లో భారీ చోరీ
వారి వద్ద పని చేసే నేపాలీలే పాత్రధారులు
కాచిగూడలో జరిగిన చోరీతో సారూప్యతలు
నగర పోలీసులతో ఆ అధికారుల సంప్రదింపులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కాచిగూడకు చెందిన కార్టన్స్ ఫ్యాక్టరీ యజమాని హేమ్‌రాజ్ దుగ్గర్ ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న లోకేంద్ర బహదూర్ షాహి నేతృత్వంలోని ముఠా మరో నేరం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ పంజా విసరడానికి ఆరు నెలల ముందు ముంబైకి చెందిన ఓ బడా వ్యాపారి ఇంట్లో ఇదే పంథాలో 5 కేజీల బంగారం తస్కరించినట్లు ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు ఈ నెల 14 రాత్రి రాజస్థాన్‌లోని జైపూర్‌లో నివసించే కాంగ్రెస్ పార్టీ నేత సందీప్ చౌదరి ఇంట్లో రూ.6 కోట్ల సొత్తు దొంగతనానికీ ఇతడే సూత్రధారి అని ఆ పోలీసులు అనుమానిస్తున్నారు. దీన్ని ఖరారు చేసుకోవడానికి హైదరాబాద్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
వ్యవస్థీకృతంగా లోకేంద్ర వ్యవహారాలు..
కొన్నేళ్ల క్రితం నేపాల్ నుంచి వసలవచ్చిన లోకేంద్ర వ్యవస్థీకృతంగా ఈ చోరీలు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడి వ్యాపారుల ఇళ్లల్లో పని చేస్తున్న నేపాలీల్లో కొందరితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా ఆయా వ్యాపారుల కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు తెలుసుకుంటున్నాడు. అదను చూసుకుని అప్పటికే పని చేస్తున్న వారి ద్వారానే, ఆ స్థానంలో మరో నేపాలీని పనిలో పెట్టిస్తున్నాడు. ఆపై తన ముఠాతో రంగంలోకి దిగి ఆ ఇంటిని కొల్లగొట్టిస్తున్నాడు. ముంబైకి చెందిన వ్యాపారి ఇంట్లో ఇదే పంథాలో ఐదు కేజీల బంగారం తస్కరించారు. గత నెల్లో కాచిగూడలోనూ ఇలానే భారీ చోరీకి పాల్పడ్డారు. ఇక్కడ ఇంట్లో ఉన్న ఇద్దరు వృద్ధులకు మత్తు మందు ఇచ్చి తమ పని కానిచ్చారు.
వైశాలీ నగర్‌లోనూ ..
జైపూర్‌లోని వైశాలీనగర్‌లో ఉన్న సందీప్ చౌదరి ఇంట్లోనూ ఇదే పం«థాలో నేరం జరిగింది. ఈ ఇంట్లో పని చేసే మహిళతో పాటు ఓ పురుషుడు అదను కోసం ఎదురు చూశారు. సందీప్ జైపూర్‌లో లేని విషయం గమనించి మరో ఇద్దరికి సమాచారం ఇచ్చారు. ఆయన కుటుంబీకులతో మత్తు మందు కలిపిన టీ తాగించారు. అంతా అపస్మారక స్థితిలో ఉండగా ఆ ఇద్దరితో పాటు మరొకరినీ రప్పించిన ఈ ద్వయం ఇంట్లో ఉన్న నగదు, బంగారం, వెండి, వజ్రాభరణాలతో సహా రూ.6 కోట్ల విలువైన సొత్తుతో ఉడాయించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ప్రత్యేక బృందం భరత్ బిస్త్, హరి బహదూర్ దామిలను అరెస్టు చేశారు.
మిగిలిన ముగ్గురి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. నిందితుల విచారణలో సరైన వివరాలు రాకపోవడంతో ఈ పంథాలో జరిగిన నేరాల వివరాలు ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే కాచిగూడ చోరీ వారి దృష్టికి వెళ్లింది. ఇక్కడా, అక్కడా ఒకేలా నేరం జరగడంతో జైపూర్ చోరీ వెనుకా లోకేంద్ర బహదూర్ షాహి పాత్రను అనుమానిస్తున్నారు. దర్యాప్తు కోసం వివరాలు కోరుతూ నగర పోలీసులను సంప్రదిస్తున్నారు.