కరెంటోళ్ల సమ్మెపై జోక్యం చేసుకోండి 

Telangana Transco letter to Labor Commissioner - Sakshi

మధ్యవర్తిత్వం వహించి రాజీ కుదర్చండి

సంఘాలతో ఉమ్మడి సమావేశానికి ఏర్పాట్లు చేయండి 

ఆర్థిక పరిస్థితికి లోబడి డిమాండ్లను పరిష్కరిస్తాం 

కార్మిక శాఖ కమిషనర్‌కు తెలంగాణ ట్రాన్స్‌కో లేఖ

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ ఉద్యోగుల సమ్మె నోటీసుపై జోక్యం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖను తెలంగాణ ట్రాన్స్‌కో కోరింది. ఈ మేరకు పరస్పర ఆమోదయోగ్య పరిష్కారం కోసం విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాలతో చర్చలకు సంయుక్త సమావేశానికి ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌ రావు రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్‌కు గురువారం లేఖ రాశారు.

వేతన సవరణ, ఇతర డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఈ నెల 17న ఉదయం 8 గంటల నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తూ తెలంగా ణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయిస్‌ జేఏసీ ఇటీవల యాజ మాన్యాలకు నోటిసులు అందజేసిన విషయం తెలి సిందే. విద్యుత్‌ ఉద్యోగులు సమ్మెకు దిగితే ప్రజలు తీవ్ర అసౌకర్యాలకి గురి అవుతారని, సమ్మెకు వెళ్లకుండా వారితో రాజీ కుదర్చాలని కార్మిక శాఖ కమిషనర్‌ను తాజా లేఖలో ట్రాన్స్‌కో సీఎండీ కోరారు.  

మళ్లీ చర్చలకు సిద్ధం.. 
విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీలతో ఇప్పటికే ఐదు దఫాలుగా చర్చలు జరిపి 6శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలుకు హామీ ఇచ్చామని ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014, 2018లో వరుసగా 30శాతం, 35శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయడం, సర్విసు వెయిటేజీ, ఇతర ప్రయోజనాలను కల్పించడంతో ఉద్యోగుల వ్యయం గణనీయంగా పెరిగిందన్న అంశాన్ని సైతం జేఏసీలకు తెలియజేశామన్నారు.

రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని విద్యుత్‌ సంస్థలతో పోల్చితే రాష్ట్ర విద్యుత్‌ సంస్థల ఉద్యోగుల జీతాలు, ఇతర ప్రయోజనాలు అధికంగా ఉన్నట్టు జేఏసీలకు వివరించినట్టు పేర్కొన్నారు. యాసంగి పంటల సాగు, పదో తరగతి వార్షిక పరీక్షలు, టీఎస్‌పీఎస్సీ పోటీ పరీక్షల నేపథ్యంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తాయని జేఏసీలకు వివరించామన్నారు.

తదుపరి చర్చలకు యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయని, సమ్మె పిలుపును ఉపసంహరించుకోవాలని కోరుతూ ఇటీవల తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయిస్‌ జేఏసీకి లేఖ సైతం రాసినట్టు ప్రభాకర్‌రావు వెల్లడించారు. విద్యుత్‌ సంస్థల ఆర్థిక పరిస్థితికి లోబడి డిమాండ్ల పరిష్కారానికి మళ్లీ చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని, మధ్యవర్తిత్వం వహించి చర్చలకు ఏర్పాట్లు చేయాలని కార్మికశాఖ కమిషనర్‌ను కోరారు.  

విద్యుత్‌ సమ్మె తథ్యం
తెలంగాణ పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ స్పష్టికరణ 
సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ ఉద్యోగులు ఆత్మస్థైర్యంతో ఈ నెల 17 నుంచి సమ్మెకు సిద్ధం కా వాలని తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ చైర్మన్, కన్వీనర్లు సాయిబాబు, రత్నాకర్‌రావు పిలుపునిచ్చారు. సమ్మెలపై నిషేధాలు, చట్టాల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తూ విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు ఎదురుదాడికి దిగాయని దుయ్యబట్టారు. సమ్మె తథ్యమని, వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. సమ్మెలపై నిషేధం అమల్లో ఉందని హెచ్చరిస్తూ జేఏసీకి ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు లేఖ రాయ డాన్ని ఖండిస్తూ గురువారం ఒక ప్రకటనను విడుదల చేశారు.

అత్యవసర సేవలైనందున విద్యుత్‌ సంస్థల్లో ప్రతి 6 నెలలకోసారి సమ్మెలపై నిషేధాన్ని పొడిగించడం ఆనవాయితీ అని, ఏ రోజూ ఈ ఉత్తర్వులను ఉద్యోగులు అతిక్రమించలేదని గుర్తుచేశారు. పీఆర్సీ అమలుపై ఏడాదిగా కాలయాపన చేస్తూ ఇప్పుడు పరీక్షా సమయం, యాసంగి కాలం అని పేర్కొనడం సరికాదన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులకు జీతాలు ఎక్కువ అని యాజమాన్యాలు పేర్కొనడం అన్యాయ మన్నారు. గుజరాత్‌లో ఉద్యోగుల జీతాలు ఇక్కడి కంటే అధికమని పేర్కొన్నారు.

23 వేల మంది ఆర్టీజన్లు తక్కువ వేతనాలతో శ్రమ దోపిడీకి గురవుతున్నారని, వారికికూడా న్యా యం చేయాలన్నారు. గతేడాది ఏప్రిల్‌ 1 నుంచి ఉద్యోగులు, ఆ ర్టీజన్లు, పెన్షనర్లకు మెరుగైన పీఆర్సీ వర్తింపజేయాలని, ఈపీఎఫ్‌ నుంచి జీపీఎఫ్‌ సదుపాయం, ఆ ర్టీజన్ల సమస్యలను పరిష్క రించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో 17 నుంచి సమ్మె తథ్యమన్నారు. సమ్మెతో వినియోగదారులు, రైతులు, పరిశ్రమలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top