రేపు తొలి సర్వీసు నుంచి ఆర్టీసీ సమ్మె
సోమవారం రాత్రి వరకు స్పందించని ప్రభుత్వం
రెండో జేఏసీ కూడా సమ్మెకు సిద్ధమని ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో సమ్మె ప్రారంభానికి కేవలం ఒకేరోజు మిగిలి ఉన్నా, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవటం ప్రయాణికుల్లో ఉత్కంఠ నెలకొంది. 22వ తేదీ తెల్లవారుజాము తొలి సర్వీసు నుంచి సమ్మె ప్రారంభవుతుందని ఆర్టీసీలోని ఓ జేఏసీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పుడు మరో జేఏసీ కూడా సమ్మెకు మద్దతు ప్రకటించింది.
ఇక ప్రభుత్వం ఏం చేస్తుంది...?
సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత ఇప్పటివరకు ప్రభుత్వం నుంచిగానీ, ఆర్టీసీ అధికారుల నుంచి గానీ చర్చలకు పిలుపు రాలేదు. ఆర్టీసీలో అధికారికంగా కార్మీక సంఘాలు లేనందున చర్చలకు సిద్ధం కాలేదు. కార్మీక సంఘాలకు నేతృత్వం వహిస్తున్న నేతల్లో ఇద్దరుముగ్గురు తప్ప మిగతా అంతా ఉద్యోగ విరమణ చేసిన వారే. దీనిని కూడా ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఇది కూడా చర్చలకు సానుకూలత కల్పించలేదన్న భావనా ఉంది. తాను చర్చలకు నిరంతరం సిద్ధంగానే ఉంటానని, కార్మీకులెవరైనా వచ్చి తనతో మాట్లాడవచ్చని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పదేపదే ప్రకటించినా... సమ్మె నోటీసు ఇచ్చిన జేఏసీ నేతలు ఆయనతో మాట్లాడేందుకు వెళ్లలేదు.
ఇప్పటికిప్పుడు సమ్మె ప్రకటన చేయొద్దని భావించిన రెండో జేఏసీ పలు దఫాలు పొన్నం ప్రభాకర్‌తో భేటీ అయి, కార్మీకుల దీర్ఘకాల డిమాండ్లపై సానుకూల ప్రకటన చేయా లని లేని పక్షంలో తాము కూడా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. సోమవారం ఉదయం కూడా వెళ్లి కలిసి మాట్లాడినా సానుకూల ప్రకటన రాలేదని పేర్కొంటూ, తాను కూడా సమ్మెకు సిద్ధమని ప్రకటించింది.
మంగళవారం మధ్యాహ్నం వరకు ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకుంటే 22 తొలి సర్వీసు నుంచి సమ్మెకు దిగుతామని ఆ జేఏసీ ప్రకటించింది. ఇప్పుడు రెండు జేఏసీలు సమ్మె విషయంలో ఏకం కావటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం రాత్రి వరకు సమ్మె విషయంలో స్పందించలేదు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఎలాంటి నిర్ణయం తెలపలేని పరిస్థితి నెలకొంది. మంగళవారం వేతన సవరణ సహా కొన్ని డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయటం ద్వారా కార్మీకులను ఒప్పించి సమ్మెకు దిగకుండా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సమ్మెకు పూర్తి మద్దతు: మజ్దూర్ యూనియన్
ముషీరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వేతన సవరణ చేయాలనే డిమాండ్‌తో రవాణాశాఖ మంత్రి, ఆర్టీసీ ఎండీతో జరిపిన చర్చల్లో ఎలాంటి ఫలితం లేనందున ఈ నెల 22 నుంచి తలపెట్టి సమ్మెకు మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.హనుమంత్‌ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు డీవీకే రావు తెలిపారు. సోమవారం విద్యానగర్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ఎటువంటి పురోగతి లేనందున సమ్మెలో భాగస్వాములం అవుతున్నామని వెల్లడించారు.
భట్టి ఆధ్వర్యంలో సంప్రదింపులు..?
కాళేశ్వరం పర్యటన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ప్రకటన, సమ్మె నివారణ బాధ్యత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అప్పగించినట్టు తెలుస్తోంది. ‘సమ్మె నివారణకు భట్టి ఆధ్వర్యంలో సంప్రదింపులు ఉంటాయి’ అని పొన్నం ప్రభాకర్ పేర్కొనటం గమనార్హం.


