ఇక నీటితోపాటు కరెంటు ప్రవాహం! జలాశయాలు, కాల్వలపై  సంప్రదాయేతర విద్యుత్‌ కేంద్రాలు

Telangana Power Generation Plants On Dams Canals - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రుణ పరిమితిపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన కొత్త రుణాల సమీకరణ అసాధ్యంగా మారిన నేపథ్యంలో.. సొంత ఆదాయ వనరుల సమీకరణపై నీటిపారుదల శాఖ దృష్టి సారించింది. నిరుపయోగంగా ఉన్న వాలంతరి, ఇంజనీరింగ్‌ ల్యాబ్‌ వంటి సంస్థలకి చెందిన 100 ఎకరాల భూముల్లో లేఅవుట్లు వేసి ప్లాట్లకు వేలం నిర్వహించడం ద్వారా భారీ మొత్తంలో నిధులను సమీకరించేందుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు ప్రైవేటు పబ్లిక్‌ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో రాష్ట్రంలోని జలాశయాలు, సాగునీటి కాల్వలపై భారీ ఎత్తున సంప్రదాయేతర విద్యుత్‌ ప్లాంట్లను నెలకొల్పడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించింది.

రాష్ట్రంలోని 16 జలాశయాలపై 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్లు, కాల్వలపై మరో 2000 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్లు, నదులపై మరో 5 వేల మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌ కేంద్రాలు కలిపి 13,800 మెగావాట్ల సంప్రదాయేతర విద్యుత్‌ కేంద్రాలను నెలకొల్పడానికి అవకాశముందని ..తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఇటీవల నివేదిక సమర్పించింది. ఈ కేంద్రాలను సొంతంగా ఏర్పాటు చేస్తే ఏటా రూ.13 వేల కోట్ల ఆదాయం రానుందని, పీపీపీ పద్ధతిలో ఏటా రూ.431 కోట్లను రాయల్టీగా పొందవచ్చని అంచనా వేసింది.  

జలాశయాలతో రూ.100 కోట్ల ఆదాయం 
రాష్ట్రంలోని 16 జలాశయాలు 1,675 చ.కి.మీల ప్రాంతంలో విస్తరించి ఉండగా.. చ.కి.మీటర్‌కు 40 మెగావాట్ల సామర్థ్యం చొప్పున 10 శాతం విస్తీర్ణంలో 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సౌర విద్యుత్‌ ప్లాంట్లను నెలకొల్పవచ్చు. ఒక మెగావాట్‌కి రూ.5.5 కోట్లు చొప్పున 6,700 మెగావాట్లకు రూ.36,850 కోట్ల వ్యయం కానుంది. ఏటా 10వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానుండగా, రూ.3 వేల కోట్ల ఆదాయం రానుంది. జలాశయాలను అద్దెకు ఇచ్చినందుకు ప్రతి యూనిట్‌పై 10 పైసలను రాయల్టీగా పొందినా ఏటా రూ.100 కోట్లను నీటిపారుదల శాఖ పొందవచ్చు.  

కాల్వలతో రూ.31 కోట్లు 
రాష్ట్రంలో 40 వేల కి.మీ సాగునీటి కాల్వలుండగా, మరో 40 వేల కి.మీ కాల్వలు నిర్మాణంలో ఉన్నాయి. 8 వేల ఎకరాల్లోని కాల్వపై పీపీపీ పద్ధతిలో 2వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు రూ.9వేల కోట్ల వ్యయం కానుండగా, ఏటా 3,100 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానుంది. యూనిట్‌ విద్యుత్‌ను రూ.2.5 చొప్పున విక్రయించినా కనీసం ఏడాదికి రూ.775 కోట్ల ఆదాయం వస్తుంది. ప్రైవేటు డెవలపర్ల నుంచి యూనిట్‌కి 10 పైసలను రాయల్టీగా పొందినా ఏటా రూ.31 కోట్లను నీటిపారుదల శాఖ అర్జించవచ్చు.  

పంప్డ్‌ స్టోరేజీతో రూ.300 కోట్ల రాయల్టీ 
ములుగు అడవుల్లో 3,960 మెగావాట్లు, నిర్మల్‌ అడవుల్లో 1,200 మెగావాట్లు, ఆసిఫాబాద్‌ జిల్లా అడవుల్లో 1,500 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌ కేంద్రాలను నెలకొల్పడానికి వీలుంది. అక్కడి జలాశయాలను ఆధారం చేసుకుని 5 వేల మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. మెగావాట్‌కి రూ.6.5 కోట్ల నుంచి రూ. 7.5 కోట్ల చొప్పున రూ.35 వేల కోట్ల వ్యయం కానుంది. ఏటా 30,600 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానుండగా, యూనిట్‌కి రూ.3 ధరతో ఏటా రూ.9,200 కోట్ల ఆదాయం రానుంది. యూనిట్‌కు 10 పైసలను ప్రైవేటు డెవలర్ల నుంచి రాయల్టీగా పొందినా ఏటా రూ.300 కోట్లు రానున్నాయి.
చదవండి: అసెంబ్లీ సెగ్మెంట్లపై నజర్‌.. ఎన్నికలకు సమాయత్తంపై కేసీఆర్‌ ఫోకస్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top