
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.
ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసభ్యంతర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా కూడా పోస్టు పెట్టారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం, హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు కేటీఆర్‌పై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి పట్ల కేటీఆర్ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని వెంకట్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అలాగే, కేటీఆర్ వ్యాఖ్యలు సీఎం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉండడంతో పాటు, సామాజిక శాంతిని భంగపరిచే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. ఇక, ఎమ్మెల్సీ వెంకట్ ఫిర్యాదుతో పోలీసులు.. కేటీఆర్‌పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. దీంతో, సీసీఎస్ పోలీసులు.. కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
ఫార్ములా–ఈ కార్ రేస్ కేసులో నోటీసులు..
ఇదిలా ఉండగా.. ఫార్ములా–ఈ కార్ రేస్ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అవినీతి నిరోధక శాఖ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు శుక్రవారం పంపిన నోటీసులో సూచించారు. ఈ కేసులో కేటీఆర్ ఏ–1గా ఉన్నారు. వాస్తవానికి మే 28నే తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్‌కు మే 26న ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
అయితే విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున తిరిగి వచ్చాక హాజరవుతానని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. దీంతో ఈ నెల 16న విచారణకు హాజరుకావాలంటూ ఏసీబీ అధికారులు తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా–ఈ కార్ రేస్‌లో రూ.54.89 కోట్లు దుర్వినియోగం జరిగినట్టు ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఫార్ములా–ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి నిబంధనలు అతిక్రమించి విదేశీ కంపెనీకి డబ్బులు పంపారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ఇప్పటికే జనవరి 9న కేటీఆర్ స్టేట్‌మెంట్‌ను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు.

కేసులో ఏ–2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, ఏ–3గా ఉన్న హెచ్‌ఎండీఏ బోర్డు మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్‌రెడ్డిని సైతం ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారించారు. జనవరి 8న అర్వింద్‌కుమార్‌ను, జనవరి 9న కేటీఆర్, 10న బీఎల్‌ఎన్‌రెడ్డిని, అదే నెల 18న గ్రీన్‌కో ఏస్ నెక్సŠట్‌జెన్ ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. వీరందరి స్టేట్‌మెంట్ల ఆధారంగా ఫార్ములా–ఈ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులు, సీఈవోను జూమ్ మీటింగ్ ద్వారా వర్చువల్‌గా విచారించారు. తాజాగా కేటీఆర్‌ను ఏసీబీ ప్రశ్నిస్తుండడంతో ఈ కేసు దర్యాప్తు తుది దశకు చేరినట్టుగా తెలుస్తోంది. ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయాన్ని కేటీఆర్ సైతం ధ్రువీకరించారు.
కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడం కక్షసాధింపే: కవిత
ఫార్ములా–ఈ రేసింగ్‌లో మరోసారి విచారణకు రావాలని కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ నోటీసులు జారీ చేసిందని ఎక్స్ వేదికగా ఆమె ఆరోపించారు.