వారంలో ‘స్థానిక’ షెడ్యూల్‌! | Telangana Panchayat election schedule will be annouced before February 15 | Sakshi
Sakshi News home page

వారంలో ‘స్థానిక’ షెడ్యూల్‌!

Feb 8 2025 3:47 AM | Updated on Feb 8 2025 11:12 AM

Telangana Panchayat election schedule will be annouced before February 15

బీసీ రిజర్వేషన్లపై 10న డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక  

నివేదిక అందిన వెంటనే బీసీ, ఇతర రిజర్వేషన్లు తేల్చనున్న సర్కార్‌ 

తర్వాత ఎన్నికల తేదీలపై ఎస్‌ఈసీకి స్పష్టత ఇచ్చే అవకాశం 

వెనువెంటనే నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు కమిషన్‌ సిద్ధం 

ఒకే విడతలో మండల, జిల్లా పరిషత్‌..రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు! 

మార్చి 17, 18లోగానే స్థానిక ఎన్నికలు పూర్తి చేసే యోచన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌(Election schedule) ఈ నెల 15వ తేదీ లోగా వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల(BC Reservation)కు సంబంధించి ఏర్పాటైన డెడికేటెడ్‌ కమిషన్‌ సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్టు తెలిసింది. ఈ నివేదికపై చర్చించాక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కోటాను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయనుంది. అనంతరం రిజర్వేషన్ల ఖరా రుతో పాటు ఎన్నికల తేదీలపైనా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ)కు ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలియజేయనుంది.

వెంటనే ఎస్‌ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌(election notification) జారీ చేయనుంది. మార్చి మొదటి వారంలో ఇంటర్‌ పరీక్షలు, అదే నెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. టెన్త్‌ పరీక్షలకు ఎక్కువగా పరీక్షా కేంద్రాలు అవసరం కాబట్టి, ఇవి మొదలు కావడానికి అయిదారు రోజుల ముందే... అంటే మార్చి 17, 18 లోగానే స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.  

మూడు కాదు..రెండు విడతల్లోనే ‘పంచాయతీ’ 
    ఈ నెల 15వ తేదీ లోగా నోటిఫికేషన్‌ జారీచేస్తే..ఆ తర్వాత 10 నుంచి 15 రోజుల వ్యవధిలోనే తొలుత మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలను ఒకే విడతలో పూర్తి చేసేందుకు ఎస్‌ఈసీ సిద్ధమవుతోంది. ఈ లెక్కన ఫిబ్రవరి చివర్లోగా ఈ ఎన్నికలు పూర్తయితే..తర్వాత మార్చి 17, 18 లోగానే రెండు విడతల్లో గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. 2019లో పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించగా, ఈసారి కూడా అలాగే జరిపేందుకు ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదించినట్టు సమాచారం.

అయితే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలేవీ పెద్దగా లేవు కాబట్టి రెండు విడతల్లోనే పంచాయతీ పోరు ముగించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థలకు నోడల్‌ ఏజెన్సీ అయిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరంగా కూడా ఎన్నికల దిశగా అన్నిరకాల కసరత్తును వేగవంతం చేశారు.  

11న కలెక్టర్లతో ఎన్నికల కమిషనర్‌ భేటీ 
    ముందుగా ఏ ఎన్నికలు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉన్నా అందుకు తగిన విధంగా సిద్ధంగా ఉండేలా ఎస్‌ఈసీ కసరత్తు ముమ్మరం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు చేస్తున్న సన్నాహాలు, సన్నద్ధమౌతున్న తీరుపై ఈ నెల 11న జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఐ.రాణీ కుముదిని సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు ఈ నెల 10 తేదీన...ఎంపీటీసీ, జడ్‌పీటీసీ స్థానాల ఓటర్ల జాబితాలను జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లలో పరిశీలన కోసం ప్రదర్శించాలని ఆదేశిస్తూ శుక్రవారం రాణీ కుముదిని నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

అలాగే గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాలను ఎంపీటీసీ, జడ్‌పీటీసీ నియోజకవర్గాల వారీగా విభజించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని నరసింహాపురం ఎంపీటీసీ, కొల్లాపూర్‌ జడ్‌పీటీసీ, ఖమ్మం జిల్లాలోని పోలేపల్లి ఎంపీటీసీ, ఖమ్మం రూరల్‌ జడ్‌పీటీసీ స్థానాలు మినహా ప్రచురించాలని సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ తేదీ దాకా గ్రామ పంచాయతీ ఫొటో ఓటర్ల జాబితాల్లో పేర్లు చేర్చడం, తొలగింపు, దిద్దుబాటు వంటివి చేసే అవకాశం ఉన్నందున చట్టంలోని అంశాలకు లోబడి ఆ ప్రక్రియను చేపట్టాలని ఆమె సూచించారు.

ఇదిలా ఉంటే.. ఈ నెల 10వ తేదీకల్లా రిటర్నింగ్‌ అధికారులు, పోలింగ్‌ సిబ్బంది నియామకం, 12వ తేదీలోగా ఎన్నికల విధుల నిర్వహణకు జిల్లా, మండల స్థాయిల్లోని క్షేత్రస్థాయి సిబ్బంది (రిటర్నింట్‌ ఆఫీసర్లతో సహా)కి శిక్షణా తరగతులు చేపట్టాలని ఎస్‌ఈసీ సూచించింది. 15వ తేదీలోగా పోలింగ్‌ అధికారులు (పీవో), అసిస్టెంట్‌ పోలింగ్‌ అధికారులకు(ఏపీవో) శిక్షణ తరగతులు పూర్తి చేయాలని తెలిపింది. 

15న పోలింగ్‌ స్టేషన్ల జాబితా ప్రచురణ 
    ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈనెల 15న పోలింగ్‌ స్టేషన్ల తుది జాబితాలను ప్రచురించాలని జిల్లా కలెక్టర్లు / జిల్లా ఎన్నికల అధికారులకు (హైదరాబాద్‌ మినహా) ఎస్‌ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సీఈవోలు, సహాయ జిల్లా ఎన్నికల అధికారులు, ఎంపీడీవోలకు సర్క్యులర్‌ జారీ చేశారు. జిల్లా ఎన్నికల అధికారుల (కలెక్టర్లు) నుంచి ఆమోదం లభించాకే వాటిని ప్రచురించాలని సూచించారు. ఎంపీడీవోలు, ఎన్నికల అధికారులు పోలింగ్‌ స్టేషన్ల కోసం ప్రతిపాదిస్తున్న భవనాలను స్వయంగా పరిశీలించి, స్టేషన్ల ఏర్పాటుకు అనువుగా ఉన్నాయనే నిర్థారణకు రావాలన్నారు.  

23 శాతంలోపే బీసీ రిజర్వేషన్లు? 
    బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చి నప్పటికీ.. ఆ మేరకు సాధ్యమయ్యే అవకాశాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సమగ్ర కుల గణన సర్వే అనంతరం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చి న ట్రిపుల్‌ టెస్ట్‌ ఆదేశాల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ జనాభా ఆధారంగా వారికి రిజర్వేషన్లు కల్పించాలని (1), మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చూడాలని (2), డెడికేటెడ్‌ కమిషన్‌ను నియమించి రిజర్వేషన్లు ఖరారు చేయాలని (3) న్యాయ నిపుణులు చెబుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ వారం మొదట్లో వెల్లడించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతంగా ఉన్నారు. జనాభాకు అనుగుణంగా వీరికి రిజర్వేషన్లు కల్పించాల్సి ఉన్నందున ఈ రెండు వర్గాలకు 27.88 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుందని, 50 శాతంలో ఇంకా మిగిలింది 22.12 శాతమేనని చెబుతున్నారు. ఇక డెడికేటెడ్‌ కమిషన్‌ కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50 శాతానికి మించకుండానే రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement