Telangana Vimochana Dinotsavam: గంగాపూర్ రైల్వేస్టేషన్‌ ఘటనతో స్పీడ్‌ పెంచిన సర్దార్‌

Telangana Liberation Day: Sardar Patel Is Special To Hyderabad You Know Why - Sakshi

భారత్‌లో విలీనం కావడం ముందు నుంచి నిజాంకు ఇష్టం లేదు. భారత స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే తాను భారత్‌లో విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండే అవకాశం ఉందా అని నిజాం తన సలహాదారు సర్ వాల్టర్‌ మాంగ్టన్‌ను అడిగాడు. అయితే వాల్టర్ మాంగ్టన్ భారత్ మధ్యలో ఉన్న హైదరాబాద్‌ స్వతంత్రంగా ఉండేందుకు అవకాశం లేదని పాకిస్థాన్‌లో విలీనం కావడం అసాధ్యమని స్పష్టం చేశాడు. అయినా ఏదో విధంగా స్వతంత్రంగా ఉండాలనేదే నిజాం అభిలాష. 

మరోవైపు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడైన ఖాసీం రజ్వీ ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ సంస్థానం విలీనం చేయకూడదంటూ నిజాం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాడు. రజాకార్ల పేరుతో ఖాసీం రజ్వీ ఏర్పాటు చేసిన ప్రైవేటు సైన్యం అప్పటికే తెలంగాణాలో అరాచాకాలు సృష్టిస్తోంది. హైదరాబాద్‌లో సభ పెట్టి తాము ఎర్రకోటపై నిజాం జెండా ఎగరేస్తామని ఖాసీం రజ్వి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రారంభించాడు. 

హైదరాబాద్‌ సంస్థానంపై సైనికచర్యకు సంబంధించి నెహ్రూ-పటేల్‌ మధ్య వైరుధ్యం ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్‌ సంస్థానాన్ని విలీనం చేసుకోడానికి సైనికచర్య చివరి ప్రత్యామ్నాయం కావాలని నెహ్రూ భావించారు..పటేల్ మాత్రం తాత్సారం చేయకూడదనే ఆలోచనతో ఉన్నారు. దీనికోసం ఆపరేషన్ పోలో పేరుతో ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే ఈ ఆపరేషన్ అత్యంత వేగంగా పూర్తవ్వాలనేది పటేల్ వ్యూహం. 

గంగాపూర్ రైల్వేస్టేషన్‌లో రజాకార్లు చేసిన దాడి జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున దుమారం రేపింది. దీంతో అప్పటి వరకు సహనంతో ఉన్న పటేల్‌ వెంటనే హైదరాబాద్‌ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. వెంటనే కాశ్మీర్‌లో ఉన్న సైన్యాధ్యక్షుడు కరియప్పను ఢిల్లీకి పిలిపించిన పటేల్‌.. హైదరాబాద్‌పై చర్యకు సిద్ధం కావాలని ఆదేశించారు. దీంతో సైనికాధికారులు అత్యంత వేగంగా సైనిక చర్య పూర్తి చేసే విధంగా వ్యూహాలు రూపొందించారు.

ఒకవేళ హైదరాబాద్ సంస్థానంపై భారత సైన్యం చర్యకు దిగితే పాకిస్థాన్ ఏదైనా ప్రతీకార దాడులు చేస్తుందా అనే కోణంలోనూ పటేల్‌ వ్యూహాలు సిద్ధం చేశారు. దీనికోసం నిఘా వర్గాల నుంచి ఎప్పటికప్పడు సమాచారం సేకరించి పాకిస్థాన్ ఎత్తుగడలపై సమీక్షలు జరిపారు. ఇక భారత్ సైనిక చర్యను నిజాం సైన్యం ఎంతకాలం ఎదుర్కోగలదనే విషయంపై ప్రాథమికంగా కొంత గందరగోళం ఉండింది. ముఖ్యంగా నిజాం యుద్ధవిమానాలు కొనుగోలు చేస్తున్నాడని కొంతమంది సైనిక జనరల్స్‌ సమాచారం ఇచ్చారు. దీంతో సైనిక చర్యకు దిగాలా.. వద్దా అనే మీమాంస ఎదురైంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top