బీసీ కులగణన చేయాల్సిందే: జాజుల

Telangana: Jajula Srinivas Goud About BC Census - Sakshi

అచ్చంపేట రూరల్‌: పదేళ్లకు ఓసారి నిర్వహించే జనగణనలో బీసీ కులగణన చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలోని అతిథిగృహం ఆవరణలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. దేశంలో జంతువులు, పక్షులను లెక్కబెడుతున్నారే గానీ..బీసీలను మాత్రం లెక్కించడానికి కేంద్రానికి మనసు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు సీఎం కేసీఆర్‌ కూడా బీసీ కులగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారని పేర్కొన్నారు. బీసీల కులగణనపై నవంబర్‌లో అన్ని రాష్ట్రాలు పర్యటించి ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే డిసెంబర్‌లో భారత్‌బంద్‌కు పిలుపునివ్వడంతో పాటు జనగణనను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఆత్మగౌరవ పోరాటానికి బీసీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహగౌడ్, బీసీ సంఘం నాయకుడు కాశన్నయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top