
కార్పొరేట్ స్థాయిలో భవన సముదాయాలు
11 సమీకృత భవనాల్లో 39 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు
20న గచ్చిబౌలిలో సీఎం చేతులు మీదుగా శంకుస్ధాపన
సాక్షి, సిటీబ్యూరో : స్థిరాస్తి రిజిస్ట్రేషన్ల కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా, పరిపాలనకు ఇబ్బంది లేకుండా ఇంటిగ్రేటెడ్ సబ్–రిజిస్ట్రార్ ఆఫీసుల ఏర్పాటుకు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ చర్యలకు ఉపక్రమించింది. గ్రేటర్ పరిధిలో అవసరమైన ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్వ్యవస్థీకరించి సమీకృత భవన సముదాయాలు నిర్మించాలని నిర్ణయించింది.
11 సమీకృత భవన సముదాయాలు..
గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి నాలుగు జిల్లాల పరిధిలోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 11 సమీకృత భవనాల పరిధిలోకి తీసుకొచ్చేందుకు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ చర్యలు చేట్టింది. తొలివిడతలో రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ (తాలిమ్) కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ సబ్–రిజిస్ట్రార్ భవన సముదాయాన్ని నిర్మించనుంది. అందులో రంగారెడ్డి ఆర్వో ఆఫీస్, గండిపేట, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ కార్యాలయాల కార్యాకలాపాలు నిర్వహించే విధంగా ఏర్పాటు చేస్తోంది. ఈ ఇంటిగ్రేటెడ్ సబ్–రిజిస్ట్రార్ ఆఫీసుల భవన సముదాయానికి ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్ధాపన జరిగే విధంగా రంగం సిద్దం చేసింది.
ఇంకా ఎక్కడెక్కడ నిర్మిస్తారంటే..
నగర శివారులోని కోహెడలో అబ్దుల్లాపూర్, పెద్ద అంబర్ పేట్, హయత్‌నగర్, వనస్ధలిపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల కోసం ఇంటిగ్రేటెడ్ భవన సముదాయాన్ని నిర్మించనున్నారు.
మంకాల్‌లో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల కోసం..
బోడుప్పల్ లో ఆర్వో మేడ్చల్, కుత్బుల్లాపూర్, కీసర, శామీర్‌పేట్ కార్యాలయాల కోసం
కండ్లకోయలో ఉప్పల్, నారపల్లి, కాప్రా, ఘట్‌కేసర్, మల్కాజ్‌గిరికి..
బంజారాహిల్స్‌లో బంజారాహిల్స్, ఎస్.ఆర్. నగర్, గొల్కోండ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల కోసం..
మలక్‌పేటలో ఆజంపూరా, చార్మినార్, దూద్‌బౌలి సబ్ రిజిస్ట్రార్ ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలు పనిచేసే విధంగా ఇంటిగ్రేటెడ్ భవన సముదాయాలను నిర్మించాలని నిర్ణయించింది.
చదవండి: రైలు ప్రయాణికులకు కీలక అప్డేట్.. గమనించారా?
మరో పదమూడు సబ్ రిజిస్టార్ కార్యాలయాల కోసం నాలుగు చోట్ల ఇంటిగ్రేటెడ్ భవనాల కోసం స్ధలాలను గుర్తింపు కోసం రిజి్రస్టేషన్‌శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.