‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ చూడనున్న తెలంగాణ హైకోర్టు

Telangana HC To Watch Bad Boy Billionaires Episode Based on Ramalinga Raju - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నెట్‌ఫ్లిక్స్ వెబ్‌ సిరీస్ 'బ్యాడ్ బాయ్ బిలియనీర్స్'‌లోని సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగరాజుపై రూపొందించిన ఎపిసోడ్‌ను తెలంగాణ హైకోర్టు వీక్షించనుంది. 'బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ డాక్యుమెంటరీని విడుదల చేయాలని కోరుతూ నెట్‌ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సర్వీసెస్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు  శుక్రవారం విచారించింది. ఈ క్రమంలో ఈ సిరీస్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయడానికి అనుమతించాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే ముందు రామలింగరాజుకు సంబంధించిన ఎపిసోడ్‌ను తాము మొదట చూస్తానని ఇద్దరు జడ్జీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. (‘అలా చేయొద్దని చట్టంలో ఎక్కడుంది’)

నెట్‌ఫ్లిక్స్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ మాట్లాడుతూ.. ఈ సిరీస్‌ను ఆన్‌లైన్‌ వేదికల ద్వారా లభించిన సమాచారం ఆధారంగా తీసినట్లు పేర్కొన్నారు. కేవలం 49 సెకన్ల నిడివి గల ట్రైలర్‌ను చూడటం ద్వారా డాక్యుమెంటరీ విడుదలను నిలిపివేయడం రచయితలు,చిత్రనిర్మాతల భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం అవుందని పేర్కొన్నారు. అలాగే  ట్రయల్ కోర్టు తమ వాదనలు వినకుండా వెబ్ సిరీస్ విడుదలను నిలిపివేసిందన్నారు. అయితే ఇప్పటికే సత్యం కేసులో రామలింగరాజు దోషిగా తేలడంతో ఆయనకు సంబంధించిన ప్రతి విషయం ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌లో లభిస్తుందన్నారు. కాబట్టి రామలింగరాజు దాఖలు చేసిన అప్పీల్‌పై ఈ సిరీస్‌ ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొన్నారు.

సెప్టెంబర్ 2 న హైదరాబాద్‌లోని స్థానిక సివిల్ కోర్టు నెట్‌ఫ్లిక్స్ తన వెబ్ సిరీస్ 'బ్యాడ్ బాయ్ బిలియనీర్స్-ఇండియా' ప్రసారం చేయకుండా తాత్కాలిక మధ్యంతర స్టే జారీ చేసింది. సత్యం కంప్యూటర్స్ కు సంబంధించి 7 వేల కోట్ల అకౌంటింగ్ కుంభకోణంలో దోషిగా తేలిన బి రామలింగరాజు ఆ వెబ్ సీరీస్ ఆపాలంటూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. బాయ్స్ బిలియనీర్స్ సీరిస్ సత్యం కుంభకోణం నేపథ్యంలోనే తనపై తీశారనే అనుమానం ఉందని తనకు ఉన్న గోప్యత హక్కులను ఈ సీరీస్ ఉల్లంఘిస్తుందని రామలింగ రాజు ఆరోపించారు. తనపై ఉన్న కేసు విచారణ ఇంకా కొనసాగుతున్న కారణంగా తనను నేరస్తుడిగా చూపించే ప్రయత్నంలో భాగంగా వస్తున్న వెబ్ సీరీస్ ఆపాలని కోర్టును కోరారు

నెట్‌ఫ్లిక్స్‌ వాదనలు విన్న అనంతరం  ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఏ అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం  ప్రత్యేక వెబ్ లింక్‌తోపాటు నెట్‌ఫ్లిక్స్ న్యాయవాది అందించిన పాస్‌వర్డ్ ద్వారా ఎపిసోడ్ చూడటానికి అంగీకరించారు. అనంతరం ఈ కేసుపై తదుపరి విచారణ సెప్టెంబర్ 25 న జరుగుతుంది. కాగా వివాదాస్పద బాడ్‌ బాయ్‌ బిలియనీర్స్‌ వెబ్ సిరీస్ సత్యం కంప్యూటర్స్‌ రామలింగరాజుతోపాటు మరో 3 మంది భారతీయ బిలియనీర్ల కథ ఆధారంగా రూపొందించారు.  బ్యాంకులను, జనాన్ని మోసగించి విదేశాలకు పారిపోయిన కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా , సహారా సుబ్రతా రాయ్ పీఎన్ బీ స్కాంలో నిందితులైన నీరవ్ మోదీ , మెహుల్ చోక్సీలను ఉద్దేశించి తీసినట్లు అర్ధమవుతుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top