‘ఎల్‌నినో’ను ఎదుర్కొనేందుకు గ్రామాలు సన్నద్ధం | telangana govt holds state level workshop to prepare villages for elnino impact | Sakshi
Sakshi News home page

‘ఎల్‌నినో’ను ఎదుర్కొనేందుకు గ్రామాలు సన్నద్ధం

Aug 22 2026 5:28 AM | Updated on Aug 22 2026 5:28 AM

telangana govt holds state level workshop to prepare villages for elnino impact

సదస్సును ప్రారంభిస్తున్న సీతక్క. చిత్రంలో తుమ్మల, వాకిటి శ్రీహరి, దాన కిశోర్‌ తదితరులు

రైతులు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

ముందస్తు కార్యాచరణపై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో మంత్రులు తుమ్మల, సీతక్క, శ్రీహరి

సాక్షి, హైదరాబాద్, ఏజీవర్శిటీ: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశమున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు కార్యాచర­ణతో సిద్ధంగా ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరి తెలిపారు. గ్రామస్థాయిలో ప్రతి శాఖ వేర్వేరుగా కాకుండా వ్యవసాయం, ఉద్యా­నవనం, పశుసంవర్థక, మత్స్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో పనిచే­యా­లని సూచించారు. ప్రతి గ్రామానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించి, స్వల్పకాలిక అవసరాలతోపాటు వచ్చే పదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనులను ఎంపిక చేయాలన్నారు. 

వీబీ–జీ రామ్‌జీ నిధులను ప్రణాళికాబద్ధంగా వినియోగించాలని, ఈ నిధుల­తో శాశ్వత సామాజిక ఆస్తులను నిర్మించాలని చెప్పారు. నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పంటకు పంట కుంట, ప్రతి గ్రామానికి ఊటకుంట వంటి పనులను  చేపట్టాలన్నారు. పంట కుంటల ద్వారా భూగర్భ జలాలు పెరగడంతోపాటు వ్యవసాయం, చేపల పెంపకం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతా­యని తెలిపారు. శుక్రవారం టీజీఐఆర్డీలో ఎల్‌నినో ప్రభావం, వివిధ ప్రభుత్వ రంగాల్లో చేప­ట్టా­ల్సిన ముందస్తు కార్యాచరణపై జరిగిన రాష్ట్ర­స్థాయి వర్క్‌షాప్‌లో మంత్రులు పాల్గొన్నారు.

‘ప్రతి గ్రామ పంచాయతీకి ఒక వెబ్‌సైట్‌’ ఆవిష్కరణ 
ఈ సందర్భంగా ‘ప్రతి గ్రామ పంచాయతీకి ఒక వెబ్‌సైట్‌’ను మంత్రులు ఆవిష్కరించారు. ఈ వెబ్‌సైట్‌లో గ్రామాల వారీగా సమగ్ర వివరాలు పొందుపరచనున్నారు. గ్రామ జనాభా, అవస­రాలు, వనరులు, గ్రామాభివృద్ధి ప్రణాళిక, శాఖల వారీగా జరుగుతున్న పనులు వంటి సమగ్ర వివరా­లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. పీఆర్‌­ఆర్‌డీ స్పెషల్‌ సీఎస్‌ దానకిశోర్‌ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి నిధుల అభివృద్ధి ప్రణాళికను రూపొందించి తెలంగాణ గ్రామ పంచాయతీలను దేశంలో అగ్రగామిగా, స్వయం సమృద్ధిగా, అను­బంధ శాఖలతో అనుసంధానిస్తున్నామని చెప్పారు.

ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, సీఎస్‌ సంజయ్‌­జాజు, పీఆర్‌ కమిషనర్‌ దివ్య దేవరాజన్, వ్యవసా­య శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, పశు­సంవర్థకశాఖ కార్యదర్శి ఇలంబర్తి , టీజీఐఆర్డీ సీఈఓ నిఖిల, అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, డీఆర్డీ­ఓలు, డీపీఓలు, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థక, మత్స్య శాఖల అధికారులు పాల్గొ­న్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గ్రా­మా­లను సిద్ధం చేయాలని సీతక్క చెప్పా­రు. గ్రామాలకు సమగ్ర అభివృద్ధి ప్రణా­ళిక ఉండాలని చెప్పారు. 

భారీ ప్రాజెక్టులు నిర్మించినా, ఇప్పటికీ 30 లక్షల బోర్లపై సాగు ఆధారపడి ఉన్నందున, భూగర్భ జలాలను పెంచే పనులను ఉపాధి హామీ ద్వారా విస్తృతంగా చేపట్టా­ల్సిన అవసరం ఉందని తుమ్మల చెప్పారు. కరువు పరిస్థితుల్లో పశువుల పెంపకం, సంరక్షణపై రైతుల­కు అవగాహన కల్పించాలని వాకిటి శ్రీహరి చెప్పా­రు. సెప్టెంబర్‌లో వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎస్‌ సంజయ్‌ జాజు అధికారులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement