కొత్త వైద్య కళాశాలలకు 3,897 పోస్టులు 

Telangana Govt Declares Creation Of 3897 Posts In 9 Medical Colleges - Sakshi

ఒక్కో కళాశాలకు 433 పోస్టులు 

ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం­లో కొత్తగా ఏర్పాటు చేయనున్న 9 ప్రభుత్వ వైద్య కళాశాలలకు కొత్తగా 3,897 పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో వైద్య కళాశాలకు వివిధ కేటగిరీల్లో కలిపి 433 పోస్టులను మంజూరు చేసింది. ఇందులో ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, నర్సింగ్, ఇతర వైద్య సిబ్బంది పోస్టులు ఉన్నాయి.

రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్‌ భూపాలపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్, జనగాం, నిర్మల్‌ వైద్య కళాశాలలు, అనుబంధ ఆస్పత్రుల కోసం ఈ పోస్టులు మంజూరయ్యాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో ప్రారంభించిన 12 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలతోపాటు వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్న మరో 9 వైద్య కళాశాలల కోసం ఇప్పటివరకు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలో మొత్తం 15,476 కొత్త పోస్టులను మంజూరు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిధిలో కేవలం 5 వైద్య కళాశాలలుండగా గత 8 ఏళ్లలో వాటి సంఖ్యను ప్రభుత్వం 17కు పెంచింది. దీంతో అదనంగా 1,150 మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2014లో ప్రభుత్వ కాలేజీల్లో 850గా ఉన్న ఎంబీబీఎస్‌ సీట్లు, ఈ ఏడాది నాటికి 2,790కి పెరిగాయి. 

ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు
కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుతో నాణ్యమైన వైద్యం, వైద్య విద్య 
రాష్ట్ర ప్రజలకు చేరువవుతున్నది. పెద్ద పట్టణాలకు మాత్రమే పరిమితమైన స్పెషాలిటీ వైద్యం జిల్లాకొక వైద్య కళాశాల ఏర్పాటుతో గ్రామీణ ప్రజలకు చేరువైంది. పేదలకు సమీపంలోనే ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. 
– వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top