CM KCR Health Updates: అంతా ఓకే.. విశ్రాంతి చాలు

Telangana CM KCR Health Is Stable: Yashoda Hospital - Sakshi

సీఎం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారన్న వైద్యులు

నీరసం, ఎడమ చేయి నొప్పికి యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు 

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. ఉదయం 8 గంటల సమయంలో నీరసం, ఎడమచేయి నొప్పితో కేసీఆర్‌ ఇబ్బందిపడుతున్నట్టుగా సోమాజిగూడ యశోద ఆస్పత్రికి ఫోన్‌ వచ్చింది. దీనితో ఆస్పత్రి వైద్యులు ప్రగతిభవన్‌కు వెళ్లి పరీక్షించారు. ఆస్పత్రికి వచ్చి సాధారణ టెస్టులతోపాటు ముందుజాగ్రత్త  పరీక్షలు చేయించుకోవాలని వారు సూచించడంతో.. సీఎం కేసీఆర్‌ యశోద ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి ప్రగతిభవన్‌కు వెళ్లిపోయారు. 


సీఎం ఆరోగ్య పరిస్థితిని వివరిస్తున్న డాక్టర్‌ ప్రమోద్‌కుమార్‌. చిత్రంలో డాక్టర్‌ విష్ణురెడ్డి, డాక్టర్‌ ఎంవీ రావు 

నరంపై ఒత్తిడితో.. 
సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ సమస్య వల్ల కేసీఆర్‌ ఎడమ చేతి నొప్పితో బాధపడుతున్నట్టు గుర్తించామని ఆ యన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు. ఎడ మ చేయికి వెళ్లే నరంపై ఒత్తిడి పడటంతో ఇలా నొప్పి వస్తుందన్నారు. పత్రికలు చదవడం, ఐ– ప్యాడ్‌ వాడే అలవాటు ఉండటంతోపాటు వయసు రీత్యా నొప్పి వచ్చి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇది మినహా ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారన్నారు.

కేసీఆర్‌కు పరీక్షలు చేసిన ఆస్పత్రి చీఫ్‌ ఆఫ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ విష్ణురెడ్డి, చీఫ్‌ కార్డియాలజీ డాక్టర్‌ ప్రమోద్‌ కుమా ర్‌తో కలిసి ఎంవీ రావు మీడియాతో మాట్లాడారు. సీఎం ఇంట్లో కళ్లు తిరిగి పడిపోయినట్టు జరిగిన ప్రచారంలో నిజం లేదన్నారు. 

అన్నీ నియంత్రణలోనే..: సీఎం కేసీఆర్‌కు ఏటా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, ఈసారి పరీక్షల సమ యం కూడా ఆసన్నమైందని ఎంవీరావు తెలిపారు. 90శాతం పరీక్షల నివేదికలు వచ్చాయని, సీఎం ఆరోగ్యంగా ఉన్నట్టు నిర్ధారించామని చెప్పారు. యాంజియోగ్రామ్‌ నార్మల్‌ వచ్చిందని.. రక్తంలో హిమోగ్లోబిన్, కిడ్నీ, లివర్‌ ఫంక్షన్, కొలెస్ట్రాల్‌ అన్నీ బాగున్నాయన్నారు.

బీపీ, మధుమేహం నియంత్రణలోనే ఉన్నాయన్నారు. అల్ట్రాసౌండ్‌ పరీక్షలు సైతం చేశామన్నారు. సీఎం కేసీఆర్‌ ఈ మధ్య వరుస పర్యటనలు, బిజీ షెడ్యూల్స్‌కు తోడు ఎండాకాలం వల్ల నీరసానికి గురైనట్టు గుర్తించామని.. వారం పాటు విశ్రాంతి అవసరమని సూచించామని చెప్పారు. కేసీఆర్‌కు యాంజియో గ్రామ్‌ తర్వాత.. కళ్లు తిరుగుతాయనే ఉద్దేశంతో బెడ్‌పై పడుకోబెట్టి వార్డులోకి తీసుకెళ్లా మని వివరించారు. విశ్రాంతి తర్వాత కేసీఆర్‌  మళ్లీ అన్ని పనులు చేస్తారని ఎంవీరావు పేర్కొన్నారు. 

సీఎం గుండె పదిలమే..
కేసీఆర్‌కు ఎడమ చేతి నొప్పిరావడంతో.. కరోనరీ ఆర్టరీస్‌లో (గుండెకు రక్తం సరఫరా చేసే ధమనుల్లో) రక్తం గడ్డకట్టి ఉంటుందేమోనని యాంజి యోగ్రామ్‌ నిర్వహించాం. అదృష్టవశాత్తు ఎలాం టి బ్లాక్‌లు లేవని గుర్తించాం. గుండె పనితీరు తెలుసుకోవడానికి నిర్వహించిన ఈసీజీ, 2డీ ఎకో టెస్టుల ఫలితాలు బాగా వచ్చాయి.

గుండెకు సంబంధించి సీఎంకు ఎలాంటి సమస్యా లేదని నిర్ధారించాం. ఎడమచేతి నొప్పి వెనుక కారణమేంటో తెలుసుకోవడానికి మెడ, మెదడుకు సంబంధించిన ఎంఆర్‌ఐ టెస్టులు నిర్వహించాం. వైద్యులందరం కూర్చుని పరిశీలించి.. సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ కారణమని తేల్చాం.    
– ప్రమోద్‌కుమార్, చీఫ్‌ కార్డియాలజిస్ట్, యశోద ఆస్పత్రి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top