
సాక్షి, వరంగల్: మండలంలోని ఆశాలపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు కేటాయించడం చర్చనీయాంశమైంది. గ్రామంలో ఉన్న ఒకేఒక ఎస్సీ మహిళ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా కానుంది. వివరాలిలా ఉన్నాయి. ఆశాలపల్లిలో ఎస్సీ కుటుంబాలు లేవు. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం రామారం నుంచి కొంగర మల్లమ్మ, వెంకటయ్య దంపతులు 10 సంవత్సరాల కిత్రం బతుకుదెరువు కోసం పాలేరు పనికి ఆశాలపల్లికి వచ్చారు. వారికి ముగ్గురు కూతుళ్లు ఉండగా పెళ్లి చేశారు. మల్లమ్మ, వెంకటయ్య ఇద్దరే ఎస్సీ ఓటర్లుగా నమోదయ్యారు. కాగా, మూడు నెలల క్రితం వెంకటయ్య గేదెలను మేపడానికి వెళ్లి కుంటలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు.
మల్లమ్మ ఒక్కరే ఎస్సీ ఓటరుగా గ్రామంలో నమోదై ఉంది. ఇప్పుడు ప్రకటించిన ఆశాలపల్లి సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. గ్రామంలో ఉన్న ఒకే ఒక్క ఎస్సీ మహిళ మల్లమ్మ ఏకగ్రీవంగా సర్పంచ్ కానుంది. దీంతో సర్పంచ్ రిజర్వేషన్ మార్చాలని కోరుతూ మాజీ సర్పంచ్ కిశోర్‌యాదవ్‌తో పాటు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, నాయకులు రమేశ్, నాగరాజు, సంపత్, నరహరి తదితరులు డీపీఓ రాంరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కాగా, ఒక్కసారి రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత మార్చడానికి వీలు లేదని, మల్లమ్మ ఏకగ్రీవ సర్పంచ్ కావడం ఖాయమని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
అధికారులు లెక్కలు సరిచేయకపోవడంతోనే..
2011 జనాభా లెక్కల ప్రకారం 1,807 జనాభా ఉంది. 350 మంది ఎస్సీలు ఉన్నట్లుగా అధికారులు లెక్కలు తేల్చారు. కానీ, వాస్తవంగా ఆ గ్రామంలో ఎస్సీలు లేరు. అధికారులు ఆ లెక్కలను సరిచేయకపోవడంతోనే రిజర్వేషన్ ఎస్సీ మహిళకు వచ్చినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో మల్లమ్మ ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికై జాక్‌పాట్ కొట్టనుంది.