ప్రజా వైద్యానికి.. రూ.10,000 కోట్లు

Telangana 2021 Revolutionary Changes In Medical Health Sector - Sakshi

వైద్య ఆరోగ్యశాఖలో విప్లవాత్మక మార్పులు 

థర్డ్‌వేవ్‌ హెచ్చరికలతో 27 వేల పడకలకు ఆక్సిజన్‌ 

వైద్య ఆరోగ్యశాఖలో ఎన్నడూలేని విధంగా 2021 సంవత్సరంలో అత్యంత విప్లవాత్మకమైన మార్పులు సంభవించాయి. వైద్య ఆరోగ్య రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఒకేసారి ప్రభుత్వ రంగంలో 8 మెడికల్‌ కాలేజీలను మంజూరు చేసింది. మంచిర్యాల, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, జగిత్యాల, రామగుండం, వనపర్తిలో రానున్న 2022–23 సంవత్సరంలో వైద్య కళాశాలలు ప్రారంభం అవుతాయి.

ప్రతీ కాలేజీలో 150 ఎంబీబీఎస్‌ సీట్ల చొప్పున 1,200 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో 9 మెడికల్‌ కాలేజీలుంటే, అంతేమొత్తంలో కొత్త కాలేజీలు రావడం విప్లవాత్మక నిర్ణయంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. దీంతో మొత్తం ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 2,840 అవుతుంది. కొత్త మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి వస్తే ఆయా ప్రాంతాల్లో స్పెషలిస్ట్‌ వైద్య సేవలు ప్రజలకు అందుతాయి.  

ఎయిమ్స్‌ తరహాలో నాలుగు టిమ్స్‌ 
ఎయిమ్స్‌ తరహాలో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ నగరానికి నలువైపులా నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయనుంది. గచ్చిబౌలి, సనత్‌నగర్, ఎల్బీనగర్, అల్వాల్‌లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌ తరహాలో వీటి సేవలు ఉండాలన్నది సర్కారు సంకల్పం. అలాగే వరంగల్‌లోనూ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కూడా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే రాష్ట్రానికి మెడికల్‌ హబ్‌గా మారుతుందని అంటున్నారు. 

అన్ని రకాల మౌలిక సదుపాయాలు, మానవవనరులను సమకూర్చి ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దేందుకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని సర్కారు నిర్ణయించింది. ఈ నిధులను సాధారణ బడ్జెట్‌తో సంబంధం లేకుండా వచ్చే రెండేళ్లలో అదనంగా కేటాయించనుంది. ‘రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి రాకూడదు.

ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. అందుకే రూ.10 వేల కోట్లు కేటాయిస్తాం’ అని సర్కారు చెప్పింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్యశాఖకు రూ. 6,295 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్‌ను సాధారణ అవసరాలకు, ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top