
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖ తనిఖీల్లో భారీ పన్ను మోసం వెలుగులోకి వచ్చింది. కేసులో హైదరాబాద్‌లోని ప్రైవేట్ సంస్థ ఎంఎస్ కీషాన్ ఇండస్ట్రీస్ ఎల్‌ఎల్‌పీ ప్రధాన పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట గోదాం, మెదక్ జిల్లాలోని కలకల్ ఆటోమోటివ్ పార్క్, ముప్పిరెడ్డిపల్లి గ్రామాల్లోని తయారీ యూనిట్లలో అధికారులు సోదాలు నిర్వహించారు.
సరుకులు తరలించకుండా భారీ విలువ కలిగిన కాపర్ సరుకుల సప్లైకి సంబంధించి పన్ను బిల్లులు జారీ చేసినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ వాహనాలను తెలంగాణ నుంచి మహారాష్ట్రకు పంపించగా.. డాక్యుమెంట్లలో మాత్రం భారీ సరుకుల రవాణా జరిగినట్టు చూపించినట్లు అధికారలు నిర్థారించారు. మోసపూరిత బిల్లుల మొత్తం విలువ రూ.100 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మోసం జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI) ద్వారా అందిన టోల్ గేట్ డేటా విశ్లేషణ ద్వారా వెలుగులోకి వచ్చింది.
సంస్థ సుమారు రూ. 33.20 కోట్లు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) ను నకిలీ లావాదేవీల ద్వారా పొందినట్టు అధికారులు గుర్తించారు. ఖాతా పుస్తకాలు, రిజిస్టర్లు, హార్డ్ డిస్కులు, సీసీటీవీ ఫుటేజ్ తదితర ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంస్థ డైరెక్టర్లు వికాష్ కుమార్ కీషాన్, రజనీష్ కీషాన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయమని హైదరాబాద్ కేంద్రమైన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) డీసీపీకి అధికారులు ఫిర్యాదు చేశారు. ఇదే కేసులో మరో సంఘటనలో, చార్మినార్ డివిజన్ మెహదీపట్నం-1 సర్కిల్‌కు చెందిన డీఎస్టీవో మజీద్ హుస్సేన్ మరో మోసాన్ని గుర్తించారు. మోసాలపై దర్యాప్తు చేపట్టినట్లు వాణిజ్య పన్నుల కమిషనర్ కె.హరిత ఒక ప్రకటనలో తెలిపారు.