
ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో(Supreme Court) తెలంగాణ స్థానిక ఎన్నికల్లో(Telangana Elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పిటిషన్‌పై(BC Reservations) విచారణ జరగనుంది. వంగ గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేపట్టనుంది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-9 అమలుపై స్టే ఇవ్వాలని పిటిషన్‌లో గోపాల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. వంగా గోపాల్‌రెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారించనున్నది. గోపాల్‌రెడ్డి ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని పిటిషన్‌లో తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఇతర రిజర్వేషన్లు అన్నీ కలిపి కూడా 50 శాతం రిజర్వేషన్ దాటవద్దని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్‌ను ఎత్తివేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఎస్సీలకు15 శాతం రిజర్వేషన్, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ 42 శాతంతో కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్లు 67 శాతం అవుతున్నదని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే జీవో 9ను తక్షణమే రద్దుచేయాలని కోరారు. ఇది ముమ్మాటికీ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285కు విరుద్ధమని పిటిషన్‌లో తెలిపారు.
ఇక, ఇప్పటికే హైకోర్టులో అదే అంశంపై పిటిషన్ విచారణలో ఉన్నందున హైకోర్టులో తేల్చుకోండని, అక్కడ తేలకపోతే ఇక్కడికి రావాలని సుప్రీంకోర్టు చెప్తుందా? లేదా ఇంకా ఏమైనా కీలక వ్యాఖ్యలు చేస్తుందా? అనే అంశంపై బీసీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. న్యాయంగా అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందేనని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మరోవైపు.. ఈ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు జారీచేసిన జీవోపై సుప్రీంకోర్టులో జరగనున్న విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఈ జీవో చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటు అధికారులను, అటు పార్టీ నేతలను ఆదేశించారు.