విద్య పూర్తయ్యే సరికి ఉద్యోగం! | Special skill training for engineering students: Sridhar Babu | Sakshi
Sakshi News home page

విద్య పూర్తయ్యే సరికి ఉద్యోగం!

May 9 2025 5:39 AM | Updated on May 9 2025 5:39 AM

Special skill training for engineering students: Sridhar Babu

ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ: మంత్రి శ్రీధర్‌బాబు  

జేఎన్‌టీయూహెచ్, టీసీఎస్‌ ఐయాన్‌ల మధ్య ఒప్పందం

సాక్షి, హైదరాబాద్‌:  యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించే మరో వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ‘ప్లేస్‌మెంట్‌ సక్సెస్‌ ప్రోగ్రాం’కింద ఐదు నెలల శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగాలకు సంసిద్ధులుగా తీర్చిదిద్దేందుకు టాటా కన్సల్టెన్సీ సర్విసెస్‌ ఐయాన్‌ (టీసీఎస్‌ ఐయాన్‌) ముందుకొచి్చందని చెప్పారు. ఈ సందర్భంగా టీసీఎస్‌ ఐయాన్‌ యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గురువారం సచివాలయంలో హైదరాబాద్‌ జేఎన్‌టీయూ, టీసీఎస్‌ ఐయాన్‌ సంస్థల మధ్య విద్యార్థులకు శిక్షణకు సంబంధించి అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడారు. యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ నెలకొల్పి యువతను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించామని చెప్పారు.  

తొలుత మంథని జేఎన్‌టీయూ విద్యార్థులకు శిక్షణ: ‘సాంకేతిక నైపుణ్యాలు లేకుండా డిగ్రీలతో ఉద్యోగాలు రావడం కష్టం. దీనిని అర్థం చేసుకున్నందునే శిక్షణపై దృష్టి సారించాం. చదువు పూర్తి చేసే సమయానికి ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అంశంలో నైపుణ్యం పెంచగలిగితే ఉద్యోగాలు ఇవ్వడం కోసం కంపెనీలు వాటికవే పరుగెత్తుకుంటూ వస్తాయి. టీసీఎస్‌ ఐయాన్‌ సంస్థ మొదటి దశలో ప్రతి ఐదు నెలల (20 వారాల)కు 100 మంది ఇంజనీరింగ్‌ విద్యార్ధులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు సిద్ధం చేస్తుంది. 

ఆ సంస్థతో ఎంప్యానెల్‌ అయిన మూడు వేలకు పైగా కంపెనీలు వీరిలో ప్రతిభావంతులను ఎంపిక చేసుకుని ఉద్యోగాలు కల్పిస్తాయి. పైలట్‌ కార్యక్రమం కింద మొదట మంథనిలోని జేఎన్‌టీయూ కళాశాల విద్యార్థులను నైపుణ్య శిక్షణకు ఎంపిక చేస్తాం..’ అని మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగ సంసిద్ధత కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీసీఎస్‌ ఐయాన్‌ గ్లోబల్‌ హెడ్‌ వెంగుస్వామి, స్కిల్‌ ఎడ్యుకేషన్‌ బిజినెస్‌ హెడ్‌ స్మృతి ముల్యే, జేఎన్‌టీయూహెచ్‌ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ టి.కిషన్‌కుమార్‌ రెడ్డి, ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement