కోవిడ్‌ నేపథ్యంలో సత్ఫలితాలనిస్తున్న ప్రత్యేక కార్యక్రమం

Special Health Program In Telangana Gurukul - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  గురుకులంలో ప్రతి తరగతికి ఓ ‘డాక్టర్‌’! విద్యార్థి ఆరోగ్య స్థితిపై కన్నేసి ఉంచడం, జలుబు, జ్వరం, దగ్గులాంటి స్వల్ప అస్వస్థత అయినా సరే గుర్తించి వెంటనే క్లాస్‌ టీచర్, పాఠశాల హెల్త్‌ సూపర్‌వైజర్‌ దృష్టికి తీసుకెళ్లడం వీరి కర్తవ్యం. డాక్టర్‌ అంటే నిజంగా ఎంబీబీఎస్‌ పట్టా తీసుకున్న అనుభవజ్ఞుడైన డాక్టర్‌ కాదండోయ్‌.. గురుకులంలోని ఓ విద్యార్థే.

కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) తన పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని మరింత శ్రద్ధగా పర్యవేక్షించే క్రమం లో ప్రయోగాత్మకంగా ‘చిన్నారి డాక్టర్‌’కార్యక్రమా న్ని చేపట్టింది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ అనంతరం గురుకుల పాఠశాలల పునఃప్రారంభం తర్వాత ఈ కార్యక్రమాన్ని అమలు చేయగా.. ప్రస్తుతం అది సత్ఫలితాలు ఇస్తున్నట్టు సొసైటీ అధికారులు చెబుతున్నారు. 

నిత్యం మరింత శ్రద్ధగా..: టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఎస్‌ పరిధిలో 269 గురుకుల పాఠశాలలున్నాయి. ఒక్కో పాఠశాలలో 5నుంచి 10 వరకు తరగతులు, ప్రతి క్లాసుకు రెండు సెక్షన్ల చొప్పున మొత్తం పన్నెండు సెక్షన్లుంటాయి. ఒక్కో గురుకులంలో గరిష్టంగా 480 మంది విద్యార్థులుంటారు. అయితే ఒక పాఠశాలకు ఒక హెల్త్‌ సూపర్‌వైజర్‌ పోస్టును మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఒక్కరిపైనే ఎక్కువ భారం పడొద్దని భావించిన అధికారులు సొసైటీకి అనుబంధంగా కొనసాగుతున్న పనేషియా ప్రాజెక్టు సహకారంతో చిన్నారి డాక్టర్‌ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు.

చిన్నారి డాక్టర్‌ కార్యక్రమంతో విద్యార్థుల ఆరోగ్య స్థితిని నిత్యం మరింత శ్రద్ధగా పరిశీలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అనారోగ్యాన్ని ముం దుగానే గుర్తించి చర్యలు తీసుకుంటున్నందున విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యే అవకా శాలు తక్కువగా ఉంటున్నాయని, కోవిడ్‌–19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ప్రయోగం మరింతగా సత్ఫలితాలనిస్తోందని వివరించారు. 

త్వరలో కోవిడ్‌ కట్టడికో బృందం 
కోవిడ్‌–19 వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ పాఠశాలల్లో అక్కడక్కడా పాజిటివ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతి పాఠశాలకు ఒక కోవిడ్‌–19 వర్క్‌ టీమ్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా సొసైటీ విద్యార్థుల ఆరోగ్య స్థితిపై నిఘా వేసి ఉంచే పనేషియా ప్రాజెక్ట్‌ హెడ్‌ సామర్ల కిరణ్‌కుమార్‌ తాజాగా కోవిడ్‌–19 వర్క్‌ టీమ్‌ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు రూపొందించారు.

ఒకట్రెండు రోజుల్లో సొసైటీ కార్యదర్శి ఆమోదం పొందిన వెంటనే ప్రతి పాఠశాలలో నలుగురితో ఒక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో పీఈటీతో పాటు ఇద్దరు టీచర్లు, హెల్త్‌ సూపర్‌వైజర్‌ సభ్యులుగా ఉంటారు. విద్యార్థుల్లో కరోనా లక్షణాలు గమనించడం, కోవిడ్‌ ప్రొటోకాల్‌ అమలు చేయడం వీరి బాధ్యత అని అధికారులు చెబుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top