ఇప్పుడే విత్తొద్దు.. | The Southwest monsoon has not yet spread across the entire state | Sakshi
Sakshi News home page

ఇప్పుడే విత్తొద్దు..

Jun 17 2026 4:41 AM | Updated on Jun 17 2026 4:41 AM

The Southwest monsoon has not yet spread across the entire state

నైరుతి ఇంకా రాష్ట్రమంతా విస్తరించలేదు

తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా ఇంకా విస్తరించలేనందున రైతులు తొందరపడి విత్తనాలు వేయవద్దని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన తరువాత విత్తే నియమాన్ని పాటించి.. అంటే ఒక వారం వ్యవధిలో తేలికపాటి నేలలో 50–60 మి.మీ., బరువు నేలలో 60–75 మి.మీ వర్షపాతం నమోదైన తరువాత లేదా 15–20 సెం.మీ. లోతు నేల తడిసిన తరువాతనే రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయాచిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మినుము, ఆముదం పంటలను విత్తుకోవాలని తెలిపింది. 

నైరుతి రుతుపవనాల ద్వారా జూన్‌ నెలలో ఉత్తర, దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాలలో సాధారణంకంటే తక్కువ వర్షపాతం, మిగిలిన జిల్లాలలో సాధారణంకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నందున అధిక తేమ, నీటి ఎద్దడి నుంచి ఆరుతడి పంటలను కాపాడుకోవడానికి పంటలను వాలుకు అడ్డంగా, బోదెలు–కాలువల పద్ధతిలో, ఎత్తు మడులు–కాలువల పద్ధతిలో విత్తుకోవాలని యూనివర్సిటీ ఆగ్రో క్లైమేట్‌ రీసెర్చ్‌ యూనిట్‌ హెడ్, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ పి.లీలా రాణి తెలిపారు. 

చెరువులు, కుంటలకు దూరంగా ఉండి తక్కువ నీటి వసతి ఉన్న రైతులు తమకు అనువైన తక్కువ నీటి అవసరమున్న ఆరుతడి పంటలను సాగుచేసుకోవాలని సూచించారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నందున కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించాలని చెప్పారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement