జీహెచ్‌ఎంసీలో ఓ మహిళకు సోకిన వైరస్‌

Source Another Person Tests UK Variant Covid Positive GHMC - Sakshi

అధికారికంగా ప్రకటించని యంత్రాంగం

అప్రమత్తమైన వైద్య, ఆరోగ్య శాఖ

గాంధీలో ఆధునిక ఆపరేషన్‌ థియేటర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బ్రిటన్‌ వేరియంట్‌ కరోనా వైరస్‌ మరో వ్యక్తికి సోకినట్లు తెలిసింది. వైద్య, ఆరోగ్య వర్గాల సమాచారం ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉండే ఒక మహిళ ఈ యూకే కరోనా వైరస్‌ బారిన పడింది. సీసీఎంబీలో నిర్వహించిన జీనోమ్‌ సీక్వెన్సీలో ఇది వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. అయితే అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి వివరాలు ప్రకటించడం లేదు. ఈ కొత్త కేసుతో రాష్ట్రంలో బ్రిటన్‌ వేరియంట్‌ కరోనా కేసులు రెండుకు చేరుకున్నాయి. (చదవండి: ఆర్టీపీసీఆర్‌లో చిక్కని బ్రిటన్‌ స్ట్రెయిన్‌..! )

కాగా సోమవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన ఒక 49 ఏళ్ల వయసున్న వ్యక్తికి బ్రిటన్‌ వేరియంట్‌ స్ట్రెయిన్‌ వచ్చినట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అతను ప్రస్తుతం వరంగల్‌లోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని తల్లికి కరోనా సాధారణ పాజిటివ్‌ రావడంతో ఆమె శాంపిళ్లను కూడా జీనోమ్‌ సీక్వెన్సీ కోసం సీసీఎంబీకి పంపించారు. అయితే ఆ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.  ఒక్కరోజు వ్యవధిలోనే 2 కేసులు నమోదు కావడంతో వైద్య, ఆరోగ్యశాఖలో అలజడి మొదలైంది. కేసుల వివరాలను కేంద్రం ప్రకటించాలే కానీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధం లేదని చెబుతున్నారు.  

‘గాంధీ’లో ఆధునిక ఆపరేషన్‌ థియేటర్‌

  • ఇతర ప్రభుత్వాస్పత్రులకు 3 ఎంఆర్‌ఐ,11 సీటీ స్కాన్‌ పరికరాలు
  • మరో 3 కార్డియాక్‌ క్యాత్‌ ల్యాబ్‌లు.. అధికారులతో ఈటల భేటీ

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వాసుపత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తేవాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. మంగళవారం వైద్యపరికరాల ఉత్పత్తి సంస్థల ప్రతినిధులతో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇందులో ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ, వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు నాగేం దర్, రాజారావు తదితరులు పాల్గొన్నారు. గాంధీ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో అధునాతన సౌకర్యాలతో (మాడ్యులర్‌) వేర్వేరు శస్త్రచికిత్స గదులను సిద్ధం చేయనున్నారు.

ఇక ఆసుపత్రిలోని 8వ ఫ్లోర్‌లో ఐదు ఆధునిక ఆపరేషన్‌ థియేటర్లను నిర్మించాలని నిర్ణయించారు. అందుకు రూ.35 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. రూ.30 లక్షల నుంచి 40 లక్షల వరకూ ఖర్చయ్యే అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందజేస్తున్నామని ఈటల తెలిపారు. అవయవ మార్పిడి కేంద్రంగా గాంధీని తీర్చిదిద్దడం వల్ల అన్ని రకాల సూపర్‌ స్పెషాలిటీ సేవలు ఒకే చోట అందుబాటులోకి వస్తాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొత్తగా 3 ఎంఆర్‌ఐ, 11 సీటీ స్కాన్‌ పరికరాలు, 3 కార్డియాక్‌ క్యాత్‌ ల్యాబ్‌లను తేవాలని నిర్ణయించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top