ఒక చేత్తో ఇచ్చి.. మరో చేత్తో వసూలు! | Some colleges are paying nominal stipends to junior doctors | Sakshi
Sakshi News home page

ఒక చేత్తో ఇచ్చి.. మరో చేత్తో వసూలు!

Apr 23 2026 2:57 AM | Updated on Apr 23 2026 2:57 AM

Some colleges are paying nominal stipends to junior doctors

పలు ప్రైవేటు వైద్య కళాశాలల నిర్వాకం 

జూనియర్‌ డాక్టర్లకు ఇవ్వాల్సిన స్టైపెండ్‌కు ఎగనామం 

చెక్కు ఇచ్చి, విద్యార్థుల నుంచి చెక్కు తీసుకుని తిరిగి వసూలు 

కొన్ని కళాశాలల్లో నామమాత్రంగా స్టైపెండ్‌ చెల్లిస్తున్న వైనం 

సంగారెడ్డి ఎంఎన్‌ఆర్‌ కాలేజీపై ఎన్‌ఎంసీకి విద్యార్థుల ఫిర్యాదు 

ప్రభుత్వం విధివిధానాలు రూపొందించాలంటున్న జూడాలు 

సాక్షి, హైదరాబాద్‌: మేనేజ్‌మెంట్‌ కోటాలో ఒక్కో మెడికల్‌ పీజీ సీటుకు రూ.కోటికి తక్కువ కాకుండా వసూలు చేసే పలు ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు అక్కడ చదివే విద్యార్థులకు ఇచ్చే స్టైపెండ్‌ను కూడా దిగమింగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కళాశాలల్లో మూడేళ్ల పీజీ కోర్సు కోసం కన్వినర్‌ కోటాలోనే ఏటా లక్షలాది రూపాయలు చెల్లించే జూనియర్‌ డాక్టర్లు మేనేజ్‌మెంట్‌ కోటా కింద ఏకంగా రూ.కోటి నుంచి రూ.3 కోట్ల వరకు ఇచ్చుకుంటున్న దాఖలాలు ఉన్నాయి. 

అయితే ప్రభుత్వ కళాశాలల్లో చదివే మెడికల్‌ పీజీ స్టూడెంట్లకు మొదటి ఏడాది రూ.67,032, రెండో ఏడాది రూ.70,757, మూడో  ఏడాది 74,482 చెల్లిస్తుండగా..  ప్రైవేటు కళాశాలలో చదివే విద్యార్థులకు మాత్రం యాజమాన్యాలు మొండి చేయ్యి చూపుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సుమారు 2,900 పీజీ మెడికల్‌ సీట్లు ఉండగా, అందులో 1,600 వరకు ప్రైవేటు కళాశాలల్లోనే ఉండటం గమనార్హం. 

అన్ని ప్రైవేటు కాలేజీలదీ ఇదే తీరు జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నిబంధనల ప్రకారం ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు కూడా ప్రభుత్వ కాలేజీలకు సమానంగా స్టైపెండ్‌ చెల్లించాల్సిందే. అయితే రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రైవేటు మెడికల్‌ కాలేజీలూ స్టైపెండ్‌ ఎగవేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్‌ఎంసీ మార్గదర్శకాల ప్రకారం ప్రైవేటు కళాశాలలు స్టైపెండ్‌ ఇవ్వాల్సి ఉండగా చెక్కుల రూపంలో ఇచ్చి, నగదు రూపంలో తిరిగి పీజీ విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయి. 

ఇందుకోసం విద్యార్థులను యాజమాన్యం సూచించిన బ్యాంకుల్లో ఖాతాలు తెరవాలని బలవంతం చేయడం, ముందుగానే సంతకం చేసిన ఖాళీ చెక్కులు తీసుకోవడం వంటివి చేస్తున్నాయని జూనియర్‌ డాక్టర్లు చెబుతున్నారు. ఈ సమస్యపై గత ఏడాది ప్రైవేట్‌ కళాశాలల్లోని జూనియర్‌ డాక్టర్లు ఆందోళనలు చేసినప్పటికీ ఇప్పటివరకు కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అయితే కొన్ని కాలేజీలు మాత్రం నామమాత్రంగా నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్ట జెపుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు.  

ఎన్‌ఎంసీ దృష్టికి ఎంఎన్‌ఆర్‌ కాలేజీ వ్యవహారం 
సంగారెడ్డి జిల్లాలోని ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీలో స్టైపెండ్‌ ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి వసూలు చేస్తున్న తీరును పీజీ మెడికల్‌ విద్యార్థులు ఎన్‌ఎంసీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కమిషన్‌ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. కాలేజీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేస్తూ, స్టైపెండ్‌ చెల్లింపులకు సంబంధించిన పూర్తి వివరాలు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు వారం రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించింది. లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అయితే జాతీయ కమిషన్‌ నోటీసులు ఇవ్వడం, ప్రైవేటు కళాశాలలు దానిని ఎలాగోలా మేనేజ్‌ చేసుకోవడం పరిపాటిగా మారిందని కొందరు వైద్య విద్యార్థులు చెపుతున్నారు.  

విద్యార్థులకు ఊరటేదీ..? 
పీజీ మెడికల్‌ విద్యార్థులు ఆసుపత్రుల్లో రోజుకు అనేక గంటలు సేవలు అందిస్తూ వైద్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ యెత్తున ఫీజులు చెల్లించి చదువుతున్న విద్యార్థులకు స్టైపెండ్‌ అందితే కొంత ఊరటగా ఉంటుంది. కానీ చాలావరకు కాలేజీలు దీనికి ఎగనామం పెడుతున్నాయి. ఎంఎన్‌ఆర్‌ కాలేజీ వ్యవహారం బయటకు రావడంతో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో కూడా ఇదే తరహా పద్ధతి కొనసాగుతోందనే విషయం వెలుగు చూసింది. స్టైపెండ్‌ విషయంలో ప్రభుత్వ పరంగా విధి విధానాలను రూపొందిస్తే బాగుంటుందని వైద్య విద్యార్థులు కోరుతున్నారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement