సొరంగం.. ఇక వేగిరం | SLBC Tunnel: NGRI Submits Report to Uttam Kumar Reddy | Sakshi
Sakshi News home page

సొరంగం.. ఇక వేగిరం

Apr 25 2026 5:56 AM | Updated on Apr 25 2026 5:58 AM

SLBC Tunnel: NGRI Submits Report to Uttam Kumar Reddy

సత్యనారాయణ అందజేసిన నివేదికతో మంత్రి ఉత్తమ్, అధికారులు

ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో భూగర్భ స్థితిగతులపై మంత్రి ఉత్తమ్‌కు నివేదిక అందించిన ఎన్జీఆర్‌ఐ 

నివేదికలో ప్రమాదకర జోన్లు, ఊటనీటి ప్రవాహం, పైకప్పు పటిష్టతపై సమాచారం 

2డీ, 3డీ చిత్రాలతో భూగర్భంలో స్థితిగతులపై స్పష్టమైన సమాచారం లభ్యతలోకి 

నివేదికను అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి ఉత్తమ్‌ 

సొరంగం తవ్వకాల వేగాన్ని నెలకు 400 మీటర్లకు పెంచాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం తవ్వకాలు మళ్లీ వేగిరం కానున్నాయి. తవ్వకాలు జరపాల్సిన భూగర్భ మార్గం ఎంత మేరకు సురక్షితమైనది? ఎక్కడెక్కడ ప్రమాదకర జోన్లు ఉన్నాయి? భూగర్భంలో ఊట నీటి ప్రవాహం ఉందా? ఇప్పటికే తవ్వన సొరంగం పైకప్పు పటిష్టత ఎలా ఉంది? అనే అంశాలపై కీలకమైన సమాచారంతో కూడిన నివేదికను నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్జీఆర్‌ఐ) ప్రధాన శాస్త్రవేత్త హెచ్‌వీఎస్‌ సత్యనారాయణ శుక్రవారం సచివాలయంలో మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అందజేశారు. 26 మీటర్ల వ్యాసం కలిగిన ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ లూప్‌ను హెలికాప్టర్‌ ద్వారా సొరంగమార్గం ఉపరితలంపై వేలాడదీస్తూ ముందుకు సాగడం ద్వారా నిర్వహించి సర్వే ఆధారంగా ఈ నివేదికను ఎన్జీఆర్‌ఐ రూపొందించింది.

ఈ సర్వేలో ఎన్జీఆర్‌ఐ సిస్మిక్‌ ఇమేజింగ్, ఎలక్ట్రికల్‌ రెసిస్టివిటీ టోమోగ్రఫీ (ఈఆర్టీ) వంటి అధునాతన జియోఫిజికల్‌ సాంకేతికతను ఎన్జీఆర్‌ఐ రూపొందించింది. భూగర్భంలోకి పంపిన తరంగాలు దేనినైనా ఢీకొని పరివర్తనం చెందుతున్నాయా? లేదా? అనే అంశాన్ని పసిగట్టి 2డీ, 3డీ చిత్రాలను సిస్మిక్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ ద్వారా రూపొందిస్తారు. ఇదే తరహాలో భూమి లోపల విద్యుత్‌ను పంపించి విద్యుత్‌ వాహక స్థితిగతులను అంచనా వేయడం ద్వారా లోపలి పరిస్థితులపై 2డీ, 3డీ చిత్రాలను ఈఆర్టీ టెస్టు ద్వారా రూపొందిస్తారు. 

భూగర్భంలో ఖాళీలు, బలహీన ప్రాంతాలు, నీటి ప్రవాహాన్ని గుర్తించడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. సొరంగం తవ్వాల్సిన మార్గంలో భూగర్భ పరిస్థితులను సమగ్రంగా విశ్లేషించి తవ్వకాల సందర్భంగా ఎలాంటి ప్రమాదాలకు తావు కల్పించకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ సమాచారం కీలకం కానుంది. గతేడాది ఫిబ్రవరి 22న ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పైకప్పు కుప్పకూలి కార్మీకులు గల్లంతైన విషయం తెలిసిందే. దీంతో సొరంగం తవ్వకాలను నిలుపుదల చేసిన ప్రభుత్వం ఏడాది విరామం తర్వాత గత నెలలో డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ టెక్నాలజీతో పునరుద్ధరించింది. రెండు వైపుల నుంచి నెల రోజుల్లో సుమారు 151.5 మీటర్ల మేర సొరంగం తవ్వకాలను పూర్తి చేశారు.

నెలకు చెరో వైపు నుంచి 200 మీటర్ల తవ్వకాలు  
సొరంగం తవ్వకాల్లో కార్మీకుల సంక్షేమానికి పెద్దపీట వేశామని మంత్రి ఉత్తమ్‌ స్పష్టం చేశారు. తవ్వకాలు పూర్తి చేసేందుకు ఎన్జీఆర్‌ఐ నివేదికలోని సమాచారం కీలకం కాబోతోందన్నారు. ఎన్జీఆర్‌ఐ పనితీరును ప్రశంసించిన మంత్రి .. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణకు నిర్వహిస్తున్న భూగర్భ పరీక్షల్లో సహకరించాలని సూచించారు. ఎన్జీఆర్‌ఐ నివేదికను సమగ్రంగా అధ్యయనం జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. దేశ, విదేశాల నుంచి యంత్రాలను సమీకరించి సొరంగం తవ్వకాలను వేగిరం చేయాలని ఆదేశించారు. నెలకు చెరో వైపు నుంచి 200 మీటర్ల మేర సొరంగం తవ్వకాలు జరిగేలా వేగాన్ని నెలరోజుల్లోగా పెంచాలని, ఇందుకు అవసరమైన ఎలక్రి్టక్‌ లోడర్లు, హెవీ డంపర్లు వంటి భారీ యంత్రాలను సమీకరించాలని ఆదేశించారు.    

Advertisement
 
Advertisement
Advertisement