దూసుకొచ్చిన లారీ.. అదుపుతప్పిన కారు | Six killed in separate road accidents | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన లారీ.. అదుపుతప్పిన కారు

Jun 19 2026 3:58 AM | Updated on Jun 19 2026 3:58 AM

Six killed in separate road accidents

రాజేందర్‌(ఫైల్‌) ,రోహిత్‌ (ఫైల్‌),మహేష్‌ (ఫైల్‌)

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి..

వరంగల్‌ హైవేపై టైర్‌ పంక్చర్‌ అయిన వాహనాన్ని ఢీకొట్టిన ఇసుక లారీ.. డ్రైవర్‌ సహా ముగ్గురు దుర్మరణం 

రాజీవ్‌ రహదారిపై డివైడర్‌ను దాటి లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

లింగాల ఘణపురం/మేడ్చల్‌ రూరల్‌: రాష్ట్రంలోని రెండు హైవేలపై బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. అతివేగంగా దూసుకొచ్చిన ఇసుక లారీ ఓ సరుకు రవాణా వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా అదుపుతప్పి డివైడర్‌ పైనుంచి దూసుకెళ్లిన ఓ కారు.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఘటనలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

సాయం కోసం వచ్చి.. రోడ్డు ప్రమాదానికి బలై..
సహచర వాహనదారుడికి సాయం చేసేందుకు అర్ధరాత్రి లారీ ఆపిన ఒకరు.. సోదరుడి మాటను కాదనలేక వచ్చిన తమ్ముడు.. రోడ్డుపై వాహనాన్ని మరమత్తు చేస్తూ ఇంకొకరు.. ఇలా ముగ్గురూ జనగామ జిల్లా నెల్లుట్ల బ్రిడ్జి వద్ద హైదరాబాద్‌–వరంగల్‌ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. మృతులను దేవరుప్పులకు చెందిన రోహిత్‌ (22), యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండ కొత్తపల్లికి చెందిన ననబాల మహేశ్‌ అలియాస్‌ మధు (23), మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టి గూడానికి చెందిన డినికెని రాజేందర్‌ (27)గా గుర్తించారు.

హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి వస్తుండగా..
ప్రత్యక్ష సాక్షులైన లారీ డ్రైవర్‌ హరీశ్, దిలీప్‌ల కథనం ప్రకారం.. దేవరుప్పులకు చెందిన కిరాణా వ్యాపారి దిలీప్‌ బుధవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌ నుంచి తన సరుకు రవాణా వాహనంలో కిరాణా సామానుతో స్వగ్రామానికి బయలుదేరాడు. అర్ధరాత్రి దాటాక నెల్లుట్ల బ్రిడ్జి సమీపం వద్దకు రాగానే టైర్‌ పంక్చర్‌ కావడంతో టైర్‌ విప్పేందుకు జాకీ కోసం రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపడం మొదలుపెట్టాడు. ఎవరూ వాహనాలు ఆపకపోవడంతో దేవరుప్పులలోని తన తమ్ముడు రోహిత్‌కు ఫోన్‌ చేసి జాకీ తీసుకురావాలని చెప్పాడు. 

అతను జాకీ తీసుకొని రాత్రి 1:30 గంటలకు వాహనం వద్దకు చేరుకున్నాడు. ఈలోగా హరీశ్‌ అనే లారీ డ్రైవర్‌ లారీని ఆపి జాకీ ఇచ్చాడు. దీంతో సరుకు రవాణా వాహన డ్రైవర్‌ మహేశ్‌ వాహనం కింద జాకీ పెట్టి టైర్‌ విప్పే ప్రయత్నం చేస్తుండగా రోహిత్‌ రోడ్డుపై కర్ర పట్టుకొని నిలబడి వచ్చిపోయే వాహనాలను అప్రమత్తం చేస్తున్నాడు. హరీశ్‌తోపాటు వచ్చిన అతని బావమరిది డినికెల రాజేందర్‌ తిరిగి లారీ ఎక్కేందుకు వెళ్తున్నాడు. లారీ డ్రైవర్‌ హరీష్, దిలీప్‌ ఇద్దరు రోడ్డు పక్కన డివైడర్‌పై కూర్చున్నారు. 

ఇంతలో ఒక్కసారిగా అతివేగంగా దూసుకొచ్చిన ఇసుక లారీ రోహిత్‌ను, ఆ తర్వాత సరుకు రవాణా వాహనాన్ని ఢీకొట్టడంతో దాని కింద ఉన్న డ్రైవర్‌ మహేశ్, లారీ ఎక్కేందుకు వెళ్తున్న రాజేందర్‌పై సరుకు రవాణా వాహనం పడటంతో ముగ్గురూ దుర్మరణం చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ శ్రావణ్‌కుమార్‌.. మృతదేహాలను జనగామ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఇసుక లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అదుపుతప్పి డివైడర్‌ దాటి.. లారీని ఢీకొని..
మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మురహరిపల్లిలో బుధవారం అర్ధరాత్రి దాటాక రాజీవ్‌ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. మేడ్చల్‌ ఏసీపీ శంకర్‌రెడ్డి, పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి న్యూ మిర్జల్‌గూడలో నివసించే చంద్రశేఖర్‌ (33) రైల్వే శాఖలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు.

 బుధవారం గోదావరిఖనిలో తన అత్తగారి ఇంటి నుంచి చంద్రశేఖర్‌ తన కుటుంబం, అతని బావమరిది కుటుంబం రెండు కార్లలో హైదరాబాద్‌ బయల్దేరారు. రాజీవ్‌ రహదారిలో అలియాబాద్‌ మున్సిపల్‌ పరిధి మురహరిపల్లి వద్దకు రాగానే చంద్రశేఖర్‌ నడుపుతున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి కుడి పక్కకు వెళ్లింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. 

దీంతో చంద్రశేఖర్‌ (33)అక్కడికక్కడే మృతిచెందగా ఆయన భార్య రేఖ (30), కుమారుడు లోహిత్, రేఖ అక్క కుమారుడు నిహాల్‌ (2) తీవ్రంగా గాయపడ్డారు. వారి వెనుకగా మరో కారులో వస్తున్న రేఖ సోదరుడు రాజశేఖర్‌ ప్రమాదాన్ని గమనించి వెంటనే 108, పోలీసులకు సమాచారం అందించారు. 108 అంబులెన్సు రాగానే సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేఖ, నిహాల్‌ మృతిచెందగా లోహిత్‌ పరిస్థితి విషమంగా ఉంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement