విద్యార్థులకు ఆడియో పుస్తకాలు

Siddipet Education Department Innovative Audio Books - Sakshi

రాష్ట్రంలో తొలిసారిగా రూపొందించిన సిద్దిపేట విద్యాశాఖ 

3 నుంచి 8వ తరగతి వరకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల పాఠాలు 

నేడు ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌ రావు 

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): కరోనా కారణంగా విద్యార్థులందరూ ఆన్‌లైన్‌ విధానంలోనే తరగతులకు హాజరవుతున్నారు. ఇతర సబ్జెక్టులతో పోల్చితే తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ విషయంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్‌ క్లాసుల్లో ఆయా భాషల పదాల ఉచ్ఛారణను అర్థం చేసుకోలేకపోతున్నారు. తద్వారా విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు తగ్గుతున్నాయని సిద్దిపేట విద్యాశాఖ గ్రహించింది. విద్యార్థుల్లో పఠనం, శ్రవణం నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంగా ఆడియో పుస్తకాలను రూపొందించింది. వీటిని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు బుధవారం సిద్దిపేటలో ఆవిష్కరించనున్నారు.  

రూపకల్పన ఇలా.. 
జాతీయ స్థాయిలో ఎన్‌సీఈఆర్‌టీ ఆడియో పుస్తకాలు అందుబాటులో ఉన్నా, రాష్ట్ర స్థాయిలో ఆ తరహా రూపకల్పన జరగలేదు. దీంతో జిల్లా విద్యాశాఖ ఆడియో పుస్తకాల తయారీకి ప్రత్యేక శ్రద్ధ వహించింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఏడుగురు భాషా పండితుల సహకారం తీసుకుంది. వారు తమ మొబైల్‌ ఫోన్‌లలో పాఠాలను వాయిస్‌ రికార్డు చేసి ఆడియో బుక్స్‌ రూపొందించారు. 3 నుంచి 8వ తరగతి వరకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల్లోని 154 పాఠాలను 226 ఆడియో పుస్తకాలుగా పొందుపర్చారు. వీటిని సిద్దిపేట విద్యామిత్ర యూట్యూబ్‌ చానల్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. 

అందరి సమన్వయంతో.. 
ఆన్‌లైన్‌ విద్యాబోధనతో విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు తగ్గుతున్నాయనే ఆలోచన నుంచి ఈ ఆడియో పుస్తకాలు రూపుదిద్దుకున్నాయి. ఈ పుస్తకాల ద్వారా విద్యార్థుల్లో భాష నైపుణ్యాలు పెరుగుతాయి.  
–డా.రమేష్, విద్యాశాఖ జిల్లా సెక్టోరియల్‌ అధికారి, ఆడియో పుస్తకాల కోఆర్డినేటర్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top