
మూడేళ్లుగా ఒక్క కేసునూ పరిష్కరించని ఎస్‌హెచ్‌ఆర్‌సీ
దేశవ్యాప్తంగా 17వ స్థానంలో తెలంగాణ
జైళ్లను పరిశీలించిన ఘటన ఒక్కటీ లేదు
ఇప్పటికీ వెబ్‌సైట్ లేని టీజీ హెచ్‌ఆర్‌సీ
ఐజేఆర్–2025 గణాంకాలు చెబుతున్నది ఇదే..
సాక్షి, హైదరాబాద్: మానవ హక్కులను కాపాడటంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్‌హెచ్‌ఆర్‌సీ) అట్టడుగు ర్యాంక్‌కు చేరింది. హక్కుల రక్షణ కోసం ఎక్కడకు వెళ్లాలో తెలియని పరిస్థితి. కేసులు నమోదైనా పరిష్కరించేవారే లేరు. ఒకటి కాదు..రెండు కాదు.. దాదాపు మూడేళ్లుగా ఇదే పరిస్థితి. దీనికి ప్రధాన కారణం చైర్మన్, సిబ్బంది లేకపోవడమే. వ్యక్తి ప్రాథమిక హక్కులతోపాటు వ్యక్తిగత స్వేచ్ఛను హరించకుండా చూసేందుకు ఈ కమిషన్ ఏర్పాటైంది.
జాతీయత, లింగం, జాతి, మతం సహా ఇతర ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సమాన హక్కులు అందేలా చూడాలి. మానవ హక్కుల రక్షణపై ఇండియా జస్టిస్ రిపోర్టు (ఐజేఆర్) అధ్యయనంలో తెలంగాణ 17వ స్థానంలో నిలిచింది. ఇటీవల ప్రభుత్వం చైర్మన్, ఇతర సిబ్బందిని నియమించింది. ఐజేఆర్ నివేదిక మేరకు ప్రత్యేక కథనం..
» పదికి 3.4 స్కోర్‌తో తెలంగాణ 17వ స్థానానికి పడిపోగా, పశ్చిమబెంగాల్ 6.99 స్కోర్‌తో ఫస్ట్ ర్యాంక్‌లో నిలిచింది.ఆంధ్రప్రదేశ్ 2.08 స్కోర్‌తో దిగువన ఉంది.
» దేశవ్యాప్తంగా సుమోటోగా కేసులు తీసుకుంటున్న శాతం : 4
» దేశవ్యాప్తంగా మహిళా చైర్‌పర్సన్లు: 0
» తెలంగాణలో దర్యాప్తు బృందంలో ఖాళీల శాతం: 50
» 2023–24లో ఎస్‌హెచ్‌ఆర్‌సీలు స్వీకరించిన కేసులు : 1,09,136
» కేసుల క్లియరెన్స్ రేట్: 83 శాతం
» తెలంగాణలో ఈ రేట్: 0
» తెలంగాణలో విచారణాధికారుల్లో మహిళలు: 0
» జైళ్ల సందర్శన: 0
ఇతర చోట్ల ఎస్‌హెచ్‌ఆర్‌సీలు వెబ్‌సైట్లను కేసులు సహా అన్ని వివరాలతో ఎప్పటికప్పుడు నిర్వహిస్తుండగా, తెలంగాణలో అధ్యయనం జరిగే నాటికి ఎలాంటి వివరాలు లేవు.
ఏర్పాటు జరిగిందిలా..
1990లో మానవ హక్కుల రక్షణ ప్రాముఖ్యతపై ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో చర్చ జరిగింది. హక్కులను ప్రోత్సహించడానికి, రక్షించడానికి బలమైన, దేశీయ సంస్థలు అవసరమని గుర్తించింది. 1993లో జరిగిన ప్రపంచ మానవ హక్కుల భేటీలో పారిస్ సూత్రాలను స్వీకరిస్తూ వ్యవస్థలు రావాలని తీర్మానించారు. స్వతంత్రంగా, విస్తృతంగా పనిచేసే సామర్థ్యం వాటికి ఉండాలని పేర్కొన్నారు. ఈ మేరకు అదే ఏడాది మన దేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ), ఆ తర్వాత రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్‌హెచ్‌ఆర్‌సీ)లు ఏర్పడ్డాయి.
ఆర్భాటం ఘనంగానే ఉన్నా..
కమిషన్లకు విస్తృతమైన అధికారాలు కల్పించారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారులపై ఫిర్యాదులొస్తే.. విచారణ చేసి నేరుగా చర్యలు చేపట్టొచ్చు. ∙కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న విషయాల్లోనూ జోక్యం చేసుకోవొచ్చు.
» ఖైదీల జీవన పరిస్థితులను అధ్యయనం చేయడానికి ప్రజలను నిర్బంధించిన ఏదైనా జైలును సందర్శించొచ్చు.
» చట్టాలను సమీక్షించి.. మానవ హక్కులను సమర్థవంతంగా అమలు చేయడానికి చర్యలను సిఫార్సు చేయొచ్చు.
» బాధితుల నుంచి నేరుగా పిటిషన్లు స్వీకరించి లేదా సుమోటోగా విచారణ చేపట్టొచ్చు. ఆర్భాటం ఘనంగానే ఉన్నా.. ఆర్థిక, మానవ వనరుల కొరతతో లక్ష్యాల సాధనలో ఇంకా బుడిబుడి అడుగులు మాత్రమే వేస్తున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఏళ్లకేళ్లు చైర్‌పర్సన్‌లు, సభ్యులు, కార్యదర్శులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
తెలంగాణలోనూ కొద్దిరోజుల క్రితం వరకు ఇదే పరిస్థితి. తీర్పు ఇచ్చేవారు, పరిపాలన మద్దతు, దర్యాప్తు చేపట్టేవారు.. ఇలా మూడు రకాల సిబ్బంది నియామకంలోనూ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధ్యయనం అభిప్రాయపడింది.
