SHRC
-
హక్కుల రక్షణ ఇలాగేనా?
సాక్షి, హైదరాబాద్: మానవ హక్కులను కాపాడటంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సీ) అట్టడుగు ర్యాంక్‌కు చేరింది. హక్కుల రక్షణ కోసం ఎక్కడకు వెళ్లాలో తెలియని పరిస్థితి. కేసులు నమోదైనా పరిష్కరించేవారే లేరు. ఒకటి కాదు..రెండు కాదు.. దాదాపు మూడేళ్లుగా ఇదే పరిస్థితి. దీనికి ప్రధాన కారణం చైర్మన్, సిబ్బంది లేకపోవడమే. వ్యక్తి ప్రాథమిక హక్కులతోపాటు వ్యక్తిగత స్వేచ్ఛను హరించకుండా చూసేందుకు ఈ కమిషన్ ఏర్పాటైంది. జాతీయత, లింగం, జాతి, మతం సహా ఇతర ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సమాన హక్కులు అందేలా చూడాలి. మానవ హక్కుల రక్షణపై ఇండియా జస్టిస్ రిపోర్టు (ఐజేఆర్) అధ్యయనంలో తెలంగాణ 17వ స్థానంలో నిలిచింది. ఇటీవల ప్రభుత్వం చైర్మన్, ఇతర సిబ్బందిని నియమించింది. ఐజేఆర్ నివేదిక మేరకు ప్రత్యేక కథనం.. » పదికి 3.4 స్కోర్‌తో తెలంగాణ 17వ స్థానానికి పడిపోగా, పశ్చిమబెంగాల్ 6.99 స్కోర్‌తో ఫస్ట్ ర్యాంక్‌లో నిలిచింది.ఆంధ్రప్రదేశ్ 2.08 స్కోర్‌తో దిగువన ఉంది. » దేశవ్యాప్తంగా సుమోటోగా కేసులు తీసుకుంటున్న శాతం : 4 » దేశవ్యాప్తంగా మహిళా చైర్పర్సన్లు: 0 » తెలంగాణలో దర్యాప్తు బృందంలో ఖాళీల శాతం: 50 » 2023–24లో ఎస్హెచ్ఆర్సీలు స్వీకరించిన కేసులు : 1,09,136 » కేసుల క్లియరెన్స్ రేట్: 83 శాతం » తెలంగాణలో ఈ రేట్: 0 » తెలంగాణలో విచారణాధికారుల్లో మహిళలు: 0 » జైళ్ల సందర్శన: 0 ఇతర చోట్ల ఎస్హెచ్ఆర్సీలు వెబ్సైట్లను కేసులు సహా అన్ని వివరాలతో ఎప్పటికప్పుడు నిర్వహిస్తుండగా, తెలంగాణలో అధ్యయనం జరిగే నాటికి ఎలాంటి వివరాలు లేవు. ఏర్పాటు జరిగిందిలా.. 1990లో మానవ హక్కుల రక్షణ ప్రాముఖ్యతపై ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో చర్చ జరిగింది. హక్కులను ప్రోత్సహించడానికి, రక్షించడానికి బలమైన, దేశీయ సంస్థలు అవసరమని గుర్తించింది. 1993లో జరిగిన ప్రపంచ మానవ హక్కుల భేటీలో పారిస్ సూత్రాలను స్వీకరిస్తూ వ్యవస్థలు రావాలని తీర్మానించారు. స్వతంత్రంగా, విస్తృతంగా పనిచేసే సామర్థ్యం వాటికి ఉండాలని పేర్కొన్నారు. ఈ మేరకు అదే ఏడాది మన దేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ), ఆ తర్వాత రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సీ)లు ఏర్పడ్డాయి. ఆర్భాటం ఘనంగానే ఉన్నా..కమిషన్లకు విస్తృతమైన అధికారాలు కల్పించారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారులపై ఫిర్యాదులొస్తే.. విచారణ చేసి నేరుగా చర్యలు చేపట్టొచ్చు. ∙కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న విషయాల్లోనూ జోక్యం చేసుకోవొచ్చు. » ఖైదీల జీవన పరిస్థితులను అధ్యయనం చేయడానికి ప్రజలను నిర్బంధించిన ఏదైనా జైలును సందర్శించొచ్చు. » చట్టాలను సమీక్షించి.. మానవ హక్కులను సమర్థవంతంగా అమలు చేయడానికి చర్యలను సిఫార్సు చేయొచ్చు. » బాధితుల నుంచి నేరుగా పిటిషన్లు స్వీకరించి లేదా సుమోటోగా విచారణ చేపట్టొచ్చు. ఆర్భాటం ఘనంగానే ఉన్నా.. ఆర్థిక, మానవ వనరుల కొరతతో లక్ష్యాల సాధనలో ఇంకా బుడిబుడి అడుగులు మాత్రమే వేస్తున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఏళ్లకేళ్లు చైర్పర్సన్లు, సభ్యులు, కార్యదర్శులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తెలంగాణలోనూ కొద్దిరోజుల క్రితం వరకు ఇదే పరిస్థితి. తీర్పు ఇచ్చేవారు, పరిపాలన మద్దతు, దర్యాప్తు చేపట్టేవారు.. ఇలా మూడు రకాల సిబ్బంది నియామకంలోనూ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధ్యయనం అభిప్రాయపడింది. -
అమ్మానాన్న వేధిస్తున్నారు.. కాపాడండి ప్లీజ్!
సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, వారి వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఓ కుమారుడు సోమవారం తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ను(హెచ్చార్సీ) ఆశ్రయించాడు. మహబూబాబాద్ జిల్లా, ఎల్లంపేట గ్రామానికి చెందిన మాలె శ్రీనివాస్ హైదరాబాదులో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. తన తల్లిదండ్రులు మాలె సత్యనారాయణ, మాలె సత్యవతి ఊరిలో ఉన్న ఆస్తులను అమ్మేసి, మళ్లీ డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను బ్యాంకు రుణం తీసుకుని ఎంసీఏ పూర్తి చేశానని, పార్ట్‌టైం జాబ్ చేస్తూ వాయిదాలు కట్టుకుంటున్నట్లు తెలిపాడు. అయితే తన తల్లిదండ్రులు ఆస్తులు అమ్మడమే కాకుండా అప్పులయ్యాయని చెప్పడంతో గత ఏడాది రూ. 22 లక్షలు నగదు ఇచ్చానని, మళ్లీ రూ.15 లక్షలు ఇవ్వాలని తల్లిదండ్రులు వేధిస్తున్నారన్నాడు. వారి కారణంగా బ్రెయిన్ టీబీ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను మానసికంగా వేధిస్తున్న తల్లిదండ్రులపై, ఎల్లంపేట సర్పంచ్, మరిపెడ పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని కమిషన్‌ను కోరాడు. -
నిమ్స్‌లో వైద్య సేవలపై ఆరా
లక్డీకాపూల్ : నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్యసేవలపై తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ చంద్రయ్య ఆరా తీశారు. బుధవారం ఆయన ఆకస్మికంగా నిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా నిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్‌లో చికిత్స పొందుతున్న పలువురు రోగులను పరామర్శించారు. ఆయా రోగుల సహయకులను సైతం విచారించి ఆస్పత్రిలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిని కూడా కలిశారు. అనంతరం నిమ్స్ సంచాలకులు ప్రొఫెసర్ కె. మనోహర్‌తో సమావేశమై ఆస్పత్రికి సంబంధించి పరిపాలనా వ్యవహారాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. -
హెచ్చార్సీకి కల్పించిన మౌలిక సదుపాయాలేంటి?
సాక్షి, అమరావతి: రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సీ)కు కర్నూలులో కల్పించిన మౌలిక సదుపాయాలు ఏమిటి? కమిషన్‌లో ఇప్పటివరకు దాఖలైన ఫిర్యాదులు ఎన్ని? తదితర వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. వాటి ఆధారంగా తగిన ఆదేశాలు ఇస్తామంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 25కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. హెచ్ఆర్సీ చైర్మన్, సభ్యులను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఆర్సీ పనిచేసేందుకు వీలుగా కార్యాలయం, సిబ్బంది, సౌకర్యాలను ఏర్పాటు చేయలేదని, దీంతో ఫిర్యాదులు తీసుకుని విచారించడం సాధ్యం కావడం లేదంటూ ఏపీ పౌరహక్కుల సంఘం సంయుక్త కార్యదర్శి మల్లేశ్వరరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. కర్నూలులో హెచ్ఆర్సీ, లోకాయుక్త కార్యాలయాలను ఏర్పాటు చేయకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని కోరుతూ అమరావతి జేఏసీ నాయకురాలు మద్దిపాటి శైలజ మరో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం మంగళవారం విచారించింది. మల్లేశ్వరరావు న్యాయవాది పొత్తూరి సురేశ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ కర్నూలులో హెచ్ఆర్సీ ఓ అతిథి గృహంలో కొనసాగుతోందని చెప్పారు. కేవలం భౌతికరూపంలో, పోస్టు ద్వారా మాత్రమే ఫిర్యాదులను పంపే వెసులుబాటు ఉందే తప్ప, ఆన్లైన్లో పంపే ఏర్పాటు హెచ్ఆర్సీ చేయలేదన్నారు. దీంతో ఫిర్యాదులు పంపడం కష్టంగా ఉందన్నారు. ఈ సమయంలో మద్దిపాటి శైలజ న్యాయవాది డి.ఎస్.ఎన్.వి.ప్రసాద్‌బాబు వాదనలు వినిపిస్తూ లోకాయుక్త పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉందని చెప్పారు. విజయవాడలో కోట్ల రూపాయలు వెచ్చించి కార్యాలయం సిద్ధం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు కర్నూలులో లోకాయుక్త ఏర్పాటునకు నిర్ణయం తీసుకుందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. హెచ్ఆర్సీకి కల్పించిన మౌలిక సదుపాయాలు, ఫిర్యాదుల స్వీకరణ యంత్రాంగం, ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు స్వీకరించారు? తదితర వివరాలతో ఓ చిన్న అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్‌ను ఆదేశించింది. -
మహేష్ భగవత్‌పై డీసీపీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : రాచకొండ డీసీపీ పులిందర్ రెడ్డి, తన ఉన్నతాధికారి రాచకొండ పోలీస్ కమీషనర్‌పై మానవహక్కుల కమీషన్లో ఫిర్యాదు చేశారు. కమీషనర్ మహేష్ భగవత్ తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడంటూ పులీందర్ రెడ్డి తనన ఫిర్యాదులో పేర్కొన్నారు. డీసీపీ ఫిర్యాదును స్వీకరించిన కమీషన్ సమగ్ర విచారణకు ఆదేశించింది. ఆగస్టు ఒకటో తేదీన రిపోర్టు ఇవ్వాలని తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ మహేందర్ రెడ్డికి మానవహక్కుల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. -
హక్కుల ఉల్లంఘనను ఉపేక్షించం: పేరిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగం ఇచ్చిన హక్కులు పౌరులకు పూర్తిస్థాయిలో అందాలని, హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సీ) సభ్యుడు కాకుమాను పెద పేరిరెడ్డి స్పష్టంచేశారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా కమిషన్ కార్యాలయం ఆవరణలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. బాధితులకు సత్వర న్యాయంకోసం యత్నిస్తున్నామని, అందినరోజే ఫిర్యాదులను పరిశీలించి, తగిన ఉత్తర్వులు ఇస్తున్నామన్నారు. పోలీసుల తీరుపై, రెవెన్యూ అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారుల బాధ్యతారాహిత్యంపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 11,298 ఫిర్యాదులు అందగా వాటిలో7,073 ఫిర్యాదులను విచారణకు స్వీకరించామన్నారు.