థాయ్‌లాండ్‌లో చికోటి చీకటి దందా.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు

Shocking Revelations Over Chikoti Praveen Thailand Casino Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  చికోటి ప్రవీణ్‌ చీకటి దందా బయటపడింది. గ్యాంబ్లింగ్‌పై నిషేధం ఉన్న థాయ్‌లాండ్‌లో.. ఓ హోటల్‌లో రహస్యంగా క్యాసినో నిర్వహిస్తూ పట్టుబడ్డాడు చికోటి. ఈ క్రమంలో ఈ కేసు విచారణను థాయ్‌ పోలీసులు వేగవంతం చేయగా..  దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి.  

థాయ్‌లాండ్‌ చోనుబురి జిల్లా బాంగ్‌ లమంగ్‌లోని ఆసియా పట్టాయా హోటల్‌ హోటల్‌ వద్ద పెద్ద ఎత్తున్న గ్యాంబ్లింగ్‌ నిర్వహిస్తున్నారని గోవా నుంచి ఓ వ్యక్తి, థాయ్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమాచారం ఆధారంగా రైడ్‌ నిర్వహించారు అక్కడి పోలీసులు. పోలీసులను చూడగానే అక్కడున్నవాళ్లంతా పరుగులు అందుకున్నారు. అయితే సకాలంలో స్పందించిన పోలీసులు వాళ్లను తప్పించుకోనివ్వలేదు. మొత్తం 93 మందితో కూడిన ముఠాను థాయ్‌లాండ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. చివరికి.. ఆ ముఠాకు బాస్‌ చికోటి ప్రవీణ్‌గా తేలింది. 

ప్రభుత్వ ఉద్యోగులు కూడా!
మొత్తం 93 మందిలో 80 మంది భారతీయులే ఉన్నారు. వాళ్లను స్వయంగా వెంటపెట్టుకుని మరీ థాయ్‌లాండ్‌కు తీసుకెళ్లిన చికోటి.. వాళ్లతో ఆటాడిస్తూ వస్తున్నాడు.  చివరికి పక్కా సమాచారంతో ఈ రాకెట్‌ను చేధించారు థాయ్‌ పోలీసులు. అయితే.. అరెస్ట్‌ అయిన వాళ్లలో హైదరాబాద్‌కు చెందిన పలువురు వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. మెదక్‌ డీసీసీబీ చైర్మన్‌.. బీఆర్‌ఎస్‌ నేత చిట్టి దేవేందర్‌రెడ్డితో పాటు  ఇసుక వ్యాపారి సాగర్‌, మరికొందరు వ్యాపార ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లేకాకుండా గాజులరామారం  వీఆర్‌ఏ వాసు సైతం అరెస్ట్‌ అయిన వాళ్లలో ఉన్నాడు. గత నెల 27వ తేదీ నుంచి థాయ్‌లాండ్‌ వెళ్లి క్యాసినో ఆడుతున్నాడు వాసు.  అయితే.. అనుమతి లేకుండా థాయ్‌లాండ్‌ వెళ్లిన వాసును తాజాగా సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు కలెక్టర్‌. వాసుతో పాటు వెళ్లిన వర్మ, యాన్‌సాగర్‌ అనే ఇద్దరు కూడా అరెస్ట్‌ అయ్యారు. 

క్యాసినోకు ఫైనాన్స్‌ చేసిన వినోద్‌రెడ్డితోపాటు చికోటి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి, తిరుమలరావు, బిల్డర్‌ మధు అరెస్ట్‌ అయ్యారు. ప్రముఖ ట్రావెల్స్‌ ఓనర్‌ను కూడా థాయ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ పేరు బయటకు రావాల్సి ఉంది. 

ఆమె సహకారం.. భారీగా వసూళ్లు
అక్రమంగా క్యాసినో నిర్వహణ కోసం ఫేమస్‌ పట్టాయా హోటల్‌ను ఎంచుకున్నాడు చికోటి. ఈ వ్యవహారంలో సితార్నన్‌ కెల్వెల్కర్‌ అనే మహిళ చికోటికి కుడి భుజంగా వ్యవహరించిందని పోలీసులు నిర్ధారించారు. ఫకిన్‌ అనే థాయ్‌ వ్యక్తిని నియమించుకుని మరీ గ్యాంబ్లింగ్‌ వ్యవహారం ఆమె నడిపించిదట. ఇక గ్యాంబ్లింగ్‌ నిర్వహణ కోసం ఇల్లీగల్‌ మైగ్రేంట్‌ వర్కర్స్‌ను సైతం చికోటి ఉపయోగించినట్లు తెలిసింది. 

పట్టాయాలో గ్యాంబ్లింగ్‌ వ్యవహారంపై దాడి నిర్వహించిన థాయ్‌ పోలీసులు.. అక్కడి సెటప్‌ చూసి ఆశ్చర్యపోయారు.  సుమారు రూ.20 కోట్లు విలువ చేసే ఇండియన్‌ కరెన్సీతో పాటు కోట్లు విలువ చేసే గేమింగ్‌ చిప్స్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆట ఆడేందుకు ఒక్కో భారతీయుడి నుంచి అక్కడ కరెన్సీ ప్రకారం 50 వేల బాట్స్‌(మన కరెన్సీలో లక్షా ఇరవై వేల రూపాయల దాకా..) చికోటి వసూలు చేసినట్లు తెలుస్తోంది. సదరు  హోటల్‌లో కన్వెన్షన్‌ హాల్‌ను క్యాసినోగా మార్చేసిన చికోటి.. నాలుగు బక్కరాట్, మూడు బ్లాక్‌జాక్‌ టేబుల్స్‌ ఏర్పాటు చేయించాడు. అక్కడి గేమింగ్‌ను సీసీ కెమెరాల ద్వారా హైదరాబాద్‌కు లైవ్‌ రికార్డింగ్‌ కనెక్ట్‌ చేశాడని థాయ్‌ పోలీసులు చెబుతున్నారు.

హైదరాబాద్‌కు చెందిన చికోటి ఇప్పటికే ఈడీ నుంచి ఫెమా దర్యాప్తును ఎదుర్కొంటున్నాడు. భారత్‌తోపాటు నేపాల్‌లోనూ క్యాసినో నిర్వహణకుగానూ.. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. 

ఇదీ చదవండి: కేంద్రం తీరుపై హరీష్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top