ఈసారీ..ఎకరానికే రైతుభరోసా | Second tranche of Rythubharosa funds deposited in farmers accounts | Sakshi
Sakshi News home page

ఈసారీ.. ఎకరానికే రైతుభరోసా

Apr 22 2026 1:35 AM | Updated on Apr 22 2026 1:37 AM

Second tranche of Rythubharosa funds deposited in farmers accounts

రెండోవిడతలో 45,11,947 మంది రైతుల ఖాతాల్లో రూ.2,206.06 కోట్లు జమ

సాక్షి, హైదరాబాద్‌: యాసంగి సీజన్‌లో రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం విడుదల చేసిన రెండోవిడత నిధులు మంగళవారం రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఈ విడతలో 45,11,947 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,206.06 కోట్లను ప్రభుత్వం జమచేసింది. గత నెలలో నర్మెట్టలో ఏర్పాటు చేసిన ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ప్రారంబోత్సవం సందర్భంగా మొదటి విడతలో భాగంగా రూ.3,446.94 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ రెండు విడతల్లో కలిపి ఇప్పటివరకు రైతు భరోసా పథకం కింద మొత్తం రూ.5,653 కోట్లు 71.05 లక్షల రైతుల ఖాతాల్లో జమయ్యాయి.  

రెండు విడతల్లోనూ... 
యాసంగి సీజన్‌ కోసం రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా గత నెలలో రైతుల ఖాతాల్లో జమ చేసింది. అప్పట్లో ఎకరంలోపు భూమి కలిగిన రైతులందరికీ రూ.3,446.94 కోట్లను జమ చేసింది. ఇక రెండో విడతగా ఐదెకరాల లోపు భూములున్న వారందరికీ రైతుభరోసా నిధులు జమ అవుతాయని ప్రకటించినా, ఆ మేరకు విడుదల చేయలేదు. రెండోసారి కూడా 45.12 లక్షల మంది రైతులకు మరో ఎకరానికి రైతుభరోసా కింద రూ.6 వేలు జమ చేసింది. 

పూర్తిస్థాయిలో రైతులందరికీ రైతుభరోసా నిధులు జమ కావాలంటే మరో రూ.3,400 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. వచ్చే నెల రోజుల్లో మిగతా మొత్తాన్ని కూడా జమ చేయనున్నట్టు వ్యవసాయశాఖ తెలిపింది. కాగా రైతుల సంక్షేమానికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తోందని, వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 

నల్లగొండ జిల్లాకు అత్యధికం..మేడ్చల్‌కు అత్యల్పం  
ఇప్పటివరకు రైతుభరోసా కింద రెండు విడతల్లోనూ అత్యధికంగా నల్లగొండ జిల్లాకు రూ.448.09 కోట్లు విడుదలయ్యాయి. ఈ జిల్లాకు చెందిన 5,40,693 మంది రైతులు ఈ మేరకు లబ్ధి పొందారు. నల్లగొండ తర్వాత ఖమ్మం జిల్లాలో 3,45,142 మంది రైతులకు రూ.271.52 కోట్లు, మూడో స్థానంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన 3,66,343 మంది రైతుల ఖాతాల్లో రూ.271.05 కోట్లు జమయ్యాయి. అత్యల్పంగా మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాకు చెందిన 25,530 మంది రైతులకు రూ.15.65 కోట్లు జమయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement