లొంగిపొమ్మని చెప్పాం కదా బాబూ | Sakshi ground report from Hidmas house | Sakshi
Sakshi News home page

లొంగిపొమ్మని చెప్పాం కదా బాబూ

Nov 20 2025 3:53 AM | Updated on Nov 20 2025 3:53 AM

Sakshi ground report from Hidmas house

హిడ్మా స్వగ్రామంలో బంధువులు, కుటుంబ సభ్యుల రోదన 

పువర్తికి బారులుతీరిన జాతీయ, స్థానిక మీడియా ప్రతినిధులు 

హిడ్మా ఇంటి నుంచి ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌  

(హిడ్మా సొంత గ్రామం పువర్తి నుంచి సాక్షి ప్రతినిధి–భద్రాద్రి కొత్తగూడెం)  : కెచ్చెడ్‌తన్‌ కెంజిరత్తున్‌ బాబు (లొంగిపొమ్మని చెప్పాం కదా బాబు), మా మాట ఎందుకు వినలేదు బాబూ... అంటూ మావోయిస్టు అగ్రనేత హిడ్మా సొంతూరైన ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామంలో మహిళలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఏపీలోని మారేడుమిల్లి దగ్గర మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మృతి చెందిన విషయం విదితమే. ఈ ‘సాక్షి’పువర్తిలో పర్యటించింది. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మీదుగా పువర్తి వెళ్లాలంటే పూర్తిగా దండకారణ్యంలో ప్రయాణించాల్సిందే. ఈ మార్గంలో గడిచిన రెండేళ్లలో పామేడు, ధర్మారం, జీడిపల్లి–1, 2, కొండపల్లి, గొల్లకొండ, పువర్తిలో ఏర్పాటైన సీఆర్‌పీఎఫ్‌ క్యాంపులను దాటుకుంటూ వెళ్లాలి. 

గతంలో ఈ క్యాంపులు దాటేప్పుడు కచ్చితంగా పహారా కాస్తున్న జవాన్లు వచ్చిపోయే వాళ్ల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసేవాళ్లు. కానీ హిడ్మా మరణ వార్త తెలిశాక బుధవారం పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. కేవలం గొల్లకొండ క్యాంపు దగ్గరే వివరాలు నమోదు చేశారు.  

బండి పారాలో హిడ్మా ఇల్లు 
వేర్వేరుగా ఉన్న 8 గ్రామాల(గుంపుల)ను కలిపి పు వర్తిగా పిలుస్తారు. ఒక్కో గ్రామాన్ని ఒక్కో పారాగా గోండు భాషలో పేర్కొంటారు. ఒక్కో పారాలో ఒక్కో ఇంటి పేరు ఉన్న వారే ఎక్కువగా జీవిస్తు న్నారు. పువర్తి విషయానికి వస్తే మడకం, డబ్బా, తుమ్మల, పటేల్, మిర్చి, నడుమ, ఓయ్, బండి పారాలు ఉన్నాయి. హిడ్మా మరణ వార్త తెలిసిన తర్వాత జాతీయ, స్థానిక మీడియా ప్రతినిధులు వేర్వేరు పారాలకు వెళ్లి హిడ్మా గురించి ఆరా తీస్తున్నారు. 

అన్ని పారాల్లోనూ విషాదభరిత వాతావరణమే నెలకొంది. ‘సాక్షి’బృందం ముందుగా మడకం పారాకు వెళ్లి హిడ్మా గురించి ఆరా తీయగా..మంగళవారం ఉదయమే తెలుగు న్యూస్‌ చానళ్లు, యూట్యూబ్‌ చానళ్లలో వచ్చిన వార్తల ఆధారంగా హిడ్మా చనిపోయినట్లు తెలిసిందని చెప్పారు. బండి పారాలో మడ్వి ఇంటి పేరు ఉన్న వాళ్లు ఉంటారని, హిడ్మా ఇల్లు కూడా అక్కడే ఉందని తెలిపారు.  

‘చచ్చిపోయాడంటే నమ్మబుద్ధి కాలేదు..’ 
బండి పారాకు చెందిన యువకులు, మహిళలు, చిన్న పిల్లలు అంతా హిడ్మా ఇంటి దగ్గరే గుమిగూడి ఉన్నారు. అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు హిందీ, తెలుగులో అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బిక్కుబిక్కుమంటూ చూశారు. తెలుగు, హిందీ తెలిసిన కొందరు హిడ్మాకు సంబంధించిన సమాచారం అందించారు. ఎప్పుడూ పూర్తి సెక్యూరిటీలో ఉండే హిడ్మా అంత తేలిగ్గా ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడంటే తమకు నమ్మబుద్ధి కావడం లేదని మడంక ఉంగా చెప్పాడు. 

మీడియా హడావుడితో నిర్ధారణ 
బుధవారం సాయంత్రం సమయానికి పదుల సంఖ్యలో మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోవడం, అందరూ కలిసి హిడ్మా ఇంటిని ఫొటోలు, వీడియోలు తీస్తూ ఆయన మరణంపై ప్రశ్నలు వేస్తుండటంతో అప్పటి వరకు హిడ్మా మరణించి ఉండడనే నమ్మకం ఎంతో కొంత కలిగిన స్థానికుల్లో ఒక్కసారిగా ధైర్యం సన్నగిల్లింది. 

ఒకరి తర్వాత ఒకరు మహిళలు హిడ్మా ఇంటి దగ్గరకు చేరుకుంటూ బోరున విలపించడం మొదలెట్టారు. దీంతో సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయానికి గ్రామంలో భావోద్వేగపూరిత వాతావరణం నెలకొంది. ఆదివాసీ మహిళలంతా ‘లొంగిపొమ్మని చెప్పాం కదా బాబూ’అంటూ రోదించారు. 

కూతురు దగ్గరికి వెళ్లిన తల్లి  
హిడ్మాకు అక్క బుద్రే, అన్న ముయ్యా ఉన్నారు. నందా, అంద అనే ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. అంద చిన్నప్పుడే కలరాతో చనిపోగా మరో తమ్ముడు నందా మావోయిస్టు పార్టీలో పని చేస్తూ కరోనా సమయంలో చనిపోయాడు. తల్లి ఇక్కడే పూరి గుడిసెలో జీవిస్తోంది. ఆమె బాగోగులను హిడ్మా తమ్ముడి కుటుంబం చూసుకుంటోంది. హిడ్మా మరణ వార్త తెలిసిన తర్వాత ఆమె తన కూతురు నివసిస్తున్న ఓయ్‌ పారాకు వెళ్లింది. 

మృతదేహాలను అప్పగిస్తారా? 
హిడ్మా మరణవార్త మంగళవారమే తెలిసినా మృతదేహం తెచ్చుకోవడానికి ఎక్కడికి వెళ్లాలి, ఏం చేయాలనేది హిడ్మా కుటుంబ సభ్యులకు తెలియదు. దీంతో బుధవారం వరకు వారంతా పువర్తిలోనే ఉండిపోయారు. చివరకు జేగురుగొండ పోలీసులు అందించిన సాయంతో గ్రామ పటేల్, హిడ్మా అన్న ముయ్యా, పీఎల్‌జీఏ బెటాలియన్‌ వన్‌ కమాండర్‌ బార్సే దేవ తమ్ముడి కొడుకులు బుధవారం విజయవాడకు బయల్దేరి వెళ్లినట్టు అక్కడున్న వారు చెప్పారు. 

అయితే మృతదేహాలు కుటుంబాలకు అప్పగిస్తారా, లేదా. అన్నది తేలాల్సి ఉంది. మడివి హిడ్మా, ఆయన భార్య రాజే, పార్టీ మెంబర్‌ మడకం మల్లాల్‌ అలియాస్‌ మల్లు మృతదేహాల కోసం వారి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు ఏపీకి వెళ్లారు.  

హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
రంపచోడవరం/చింతూరు: మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ఆరుగురు మావోయిస్టుల పోస్టుమార్టం ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. బుధవారం రాత్రి వరకు మడివి హిడ్మా, అతని భార్య రాజేతోపాటు మరో మృతదేహానికి మాత్రమే రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. కొందరు మావోయిస్టుల మృతదేహాల కోసం కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్ద వేచి చూస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement