విషాదంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ప్రజా సంఘ నాయకులు
చదివింది పదో తరగతి.. మిలటరీ టెక్నాలజీలో దిట్ట
పీపుల్స్ వార్ సభ్యుడి నుంచి ఎస్‌జెడ్‌సీ స్థాయికి ఎదిగిన మెట్టూరు జోగారావు
జోగారావు సొంతూరు శ్రీకాకుళం జిల్లా బాతుపురం
15ఏళ్ల వయసులోనే తుపాకీ పట్టి విప్లవ నినాదం
ఎట్టకేలకు మారేడుమిల్లి అడవుల్లో తూటాకు బలి
వజ్రపుకొత్తూరు రూరల్: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమల్లిలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఏడుగురు మావోయిస్టుల్లో శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతమైన వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఉన్నాడన్న వార్త ఈ ప్రాంతంలో కలకలం రేపింది. సమాచారం అందుకున్న ప్రజా సంఘాల నాయకులు బాతుపురం చేరుకున్నారు.
అయితే కుటుంబ సభ్యులకు గానీ ప్రజా సంఘాల నాయకులకు గానీ మెట్టూరు జోగారావు మృతి చెందాడన్న వార్తపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్త నిజమైతే జోగారావు మృతదేహం తమకు అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కాగా కామ్రేడ్ జోగారావు మృతితో ప్రజా సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
సాధారణ కుటుంబం నుంచి..
జోగారావు రజక కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు కామయ్య, చిన్నపిల్లమ్మ దంపతులకు ఆరుగురు సంతానంలో జోగారావు ఒకరు. తండ్రి చిన్నతనంలోనే మృతి చెందగా.. తల్లి ఇటీవలే మృతి చెందారు. జోగారావు ప్రాథమిక విద్యాభ్యాసం బాతుపురం ప్రాథమిక పాఠశాలలోనే సాగింది.
6 నుంచి పదో తరగతి వరకు అక్కుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు. చిన్నతనం నుంచే విప్లవోద్యమాలకు ఆకర్షితుడై పీపుల్స్‌వార్ పార్టీ సమావేశాలకు హాజరయ్యేవారు. 15 ఏళ్ల వయస్సులోనే 1988లో ఉద్యమంలో చేరి తుపాకీ పట్టిన జోగారావు 37 ఏళ్లగా అజ్ఞాత జీవితం గడిపి చివరికి అదే తుపాకీ తూటాకే బలయ్యారు.
టెక్నాలాజీలో దిట్ట..
పుట్టింది వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా.. చదివింది కేవలం మెట్రిక్(10వ తరగతి మాత్రమే).. జీవనం సాగించింది కారడవిలో.. అయినప్పటికీ మారుతు న్న అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని మిలిటరీ ఆపరేషన్ టెక్నాలజీలలో జోగారావు దిట్టగా మారారు. 37 ఏళ్ల అజ్ఞాత జీవితంలో పీపుల్స్‌వార్ సభ్యుడి నుంచి ఏఓబీ ఎన్‌జెడ్‌సీ సభ్యుడిగా అంచెలంచెలుగా ఎదిగారు. జోగారావుపై పోలీసులు రూ.20 లక్షల రివార్డు ప్రకటించారు.
‘మావో’ళ్లు ఎట్లున్నరో.. ఏడున్నరో?
అజ్ఞాతంలో ఉన్న కీలక మావోయిస్టు నేతలపై కుటుంబసభ్యుల బెంగ
వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్ల నేపథ్యంలో కలవరం
సాక్షి పెద్దపల్లి: ఆపరేషన్ కగార్ నేపథ్యంలో చోటు చేసుకుంటున్న వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివిధ హోదాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న పలువురు మావోయిస్టులు సురక్షితంగానే ఉన్నారా? అనే చర్చ సాగుతోంది. హిడ్మా లాంటి టాప్ కమాండర్ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఇంకా అజ్ఞాతంలో ఉన్నవారు లొంగిపోతారా? ఉద్యమం కొనసాగిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
పెద్దపల్లి జిల్లాకు చెందిన పలువురు నక్సల్స్ నేతలు పోలీసుల అదుపులో ఉన్నారని, మరికొందరు లొంగిపోయేందుకు టచ్‌లోకి వెళ్లారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘మావో’ళ్లు ఎట్లున్నరో? ఎక్కడున్నరోనని అజ్ఞాతంలో ఉన్న పలువురు మావోయిస్టుల బంధువులు, స్నేహితులు, సానుభూతిపరులు ఆందోళన చెందుతున్నారు.
పలువురి లొంగుబాటుపై ఊహాగానాలు
మల్లోజుల సోదరుల స్ఫూర్తితో జిల్లాకు చెందిన అనేకమంది అడవిబాట పట్టారు. అందులో మల్లోజుల కోటేశ్వరరావు ఎన్‌కౌంటర్‌లో చనిపోగా, వేణుగోపాల్‌రావు ఇటీవల జనజీవన స్రవంతిలోకి వచ్చారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలని తాజాగా ఆయన వీడియో విడుదల చేయడం, ఆసక్తిగలవారు తనను సంప్రదించాలని ఫోన్ నంబర్ ఇవ్వడంతో మావోయిస్టు పార్టీ ఉద్యమ మనుగడపై చర్చ జోరందుకుంది.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యడ సాంబయ్య ఉరఫ్ ఆజాద్‌తో పాటు రామగుండానికి చెందిన అస్పాసి నారాయణ ఉరఫ్ రమేశ్ సైతం ఐదురోజుల క్రితమే లొంగుబాటుకు పోలీసులను సంప్రదించారనే ఊహాగానాలు వినిపించడం గమ నార్హం.
మంథని మండలం ఎక్లాస్‌పూర్‌కు చెందిన మల్లా రాజిరెడ్డి ఉరఫ్ సంగ్రామ్ సీసీఎంగా వ్యవహరిస్తుండగా, ఈయన సైతం లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పార్టీలో ఉన్న గంగిడి సత్యనారాయణరెడ్డి, ఆలేటి రామలచ్చులు, దాతు ఐలయ్య, దీకొండ శంకరయ్య, కంకణాల రాజిరెడ్డి, జువ్వాడి వెంకటేశ్వర్‌రావు అడుగులపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది.


